Tilak Varma: ఆ పొజిషన్‌లో బ్యాటింగ్ చేయడమే ఇష్టం.. కానీ తప్పడం లేదు!

Tilak Varma No 3 Batting

Tilak Varma No 3 Batting

Tilak Varma Reveals Favourite Batting Position: టీమిండియా యువ బ్యాటర్, తెలుగు ప్లేయర్ తిలక్ వర్మ తన బ్యాటింగ్ పొజిషన్‌, జట్టులో ఎప్పటికప్పుడు మారుతున్న బాధ్యతలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగతంగా టాప్ ఆర్డర్‌లో, ముఖ్యంగా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడమంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించాడు. అయితే జట్టు అవసరాల కోసం ఆరో స్థానం, ఏడో స్థానంలోనూ బ్యాటింగ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశాడు. టాప్ ఆర్డర్ నుంచి లోయర్ మిడిలార్డర్‌కు మారడం తన కెరీర్‌లో ఎదురైన కఠినమైన సవాళ్లలో ఒకటని తిలక్ వర్మ తెలిపాడు. వెస్టిండీస్‌తో రెండో టీ20కి ముందు స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన తిలక్.. తన బ్యాటింగ్ ప్రయాణం గురించి వివరించాడు.

చిన్నప్పటి నుంచే ఓపెనర్‌గా ఆడానని, అండర్-19 ప్రపంచ కప్‌లోనూ మూడో స్థానంలో బ్యాటింగ్ చేశానని తిలక్ వర్మ చెప్పాడు. ఐపీఎల్‌లో నాలుగో స్థానంలో ఆడిన తర్వాత ఐదు, ఆరు స్థానాల్లోనూ బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిందని తెలిపాడు. ‘నేను ఎప్పుడూ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడాన్నే ఇష్టపడతాను. ముఖ్యంగా మూడో స్థానంలో ఆడటం నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఓపెనర్‌గా ఆడాను. అవకాశం వస్తే ఓపెనింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను. అయితే మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడాన్ని మరింత ఆస్వాదిస్తాను’ అని తిలక్ వెల్లడించాడు.

‘టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడానికి, లోయర్ మిడిలార్డర్‌లో ఆడటానికి చాలా తేడా ఉంటుంది. ఓపెనర్‌గా లేదా మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం, మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి మారడం పెద్దగా కష్టంగా అనిపింది. కానీ మూడో లేదా నాలుగో స్థానం నుంచి ఆరో, ఏడో స్థానాలకు మారడం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే సమయానికి బంతి పాతబడుతుంది. బౌలర్లు ఎక్కువగా యార్కర్లు సంధించే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాటింగ్ చేసే విధానం పూర్తిగా మారుతుంది. బంతి నెమ్మదిగా రావడం, చివరి ఓవర్లలో వేగంగా పరుగులు చేయాల్సిన పరిస్థితులు బ్యాటర్లకు సవాల్‌గా మారుతాయి’ అని తెలుగు ఆటగాడు తిలక్ పేర్కొన్నాడు.

బ్యాటింగ్ స్థానాలు మారుతున్న నేపథ్యంలో తన ఆటతీరుతో పాటు మానసికంగా కూడా సిద్ధమయ్యేందుకు ఎంతో శ్రమిస్తున్నానని తిలక్ వర్మ చెప్పాడు. ‘జట్టుకు ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో దానికి అనుగుణంగా మనం బాధ్యత తీసుకోవాలి. మనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలి. అందుకోసం ప్రాక్టీస్‌లోనూ, మానసికంగానూ ఎంతో కష్టపడ్డాను. లోయర్ ఆర్డర్‌లో బంతి కొద్దిగా అదుపు తప్పినా దాన్ని బౌండరీకి తరలించేందుకు సిద్ధంగా ఉండాలి. అందుకే ఆ పాత్రకు తగ్గట్టుగా నా ఆటను మార్చుకుంటున్నాను. టాప్ ఆర్డర్‌లో నాకు ప్రత్యేకమైన ఇష్టం ఉన్నప్పటికీ.. జట్టు ప్రయోజనాలే ముఖ్యం. జట్టు యాజమాన్యం ఏ స్థానంలో బ్యాటింగ్ చేయమని కోరినా ఆ బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధం. వివిధ స్థానాల్లో ఆడగలగడం ద్వారా జట్టుకు మరింత ఉపయోగపడాలన్నదే నా లక్ష్యం’ అని తిలక్ వివరించాడు.