Site icon NTV Telugu

Tilak Varma Fitness: టీమిండియాకు గుడ్‌ న్యూస్‌.. తిలక్‌ వర్మ వచ్చేస్తున్నాడు!

Tilak Varma

Tilak Varma

భారత టాప్‌ఆర్డర్ బ్యాట్స్‌మన్, తెలుగు ఆటగాడు తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో ఐదో టీ20 మ్యాచ్‌కు (జనవరి 31) అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు 2026 టీ20 వరల్డ్‌కప్‌కు కూడా అతడు పూర్తిగా ఫిట్‌గా ఉంటాడని సమాచారం. ఈ న్యూస్ అటు టీమిండియా, ఇటు అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. తిలక్ పూర్తి ఫిట్‌నెస్‌ సాధించడం భారత జట్టుకు పెద్ద బూస్ట్‌గా మారనుంది. ఎదుకంటే ఇటీవలి కాలంలో తిలక్ కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ.. టీమిండియాకు అద్భుత విజయాలు అందిస్తున్నాడు.

ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తొందరపాటుతో తిలక్ వర్మను ఆడించడం లేదట. వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకొని తిలక్ పూర్తిగా కోలుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో తిలక్ తీవ్రంగా శ్రమిస్తూ.. రీహాబిలిటేషన్ పూర్తి చేసే ప్రయత్నంలో ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ సమయంలో తిలక్ వర్మకు అబ్డొమినల్ సర్జరీ జరిగింది. కనీసం రెండు వారాల విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20 మ్యాచ్‌లకు దూరమయ్యారు.

Also Read: IS Bindra Dead: బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ ఐఎస్‌ బింద్రా మృతి!

అప్పట్లో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ… ‘తిలక్ వర్మ తొలి మూడు టీ20లకు అందుబాటులో ఉండరు. మిగిలిన రెండు మ్యాచ్‌లకు అతని ఫిట్‌నెస్‌ను బట్టి పరిగణలోకి తీసుకుంటాం’ అని తెలిపారు. తిలక్ గైర్హాజరీతో నాలుగో టీ20లో సైతం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్‌లకు మరో అవకాశం దక్కనుంది. గాయానికి ముందు 2025 ఆసియా కప్‌లో తిలక్ మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన చేశాడు. అందుకే ఫిట్‌నెస్ సాధించిన వెంటనే తుది జట్టులోకి నేరుగా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న కిషన్ లేదా ఫస్ట్ చాయిస్ అయినప్పటికీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న శాంసన్ స్థానంలో తిలక్ ఆడే అవకాశం ఉంది.

Exit mobile version