Three Indian Players Nominated For ICC Player Of The Month Award: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల, మహిళా క్రికెట్ విభాగంలో ప్రతి నెలా ఒకరికి ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు’ ప్రకటిస్తుందన్న విషయం తెలిసిందే! ఇప్పుడు తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు గాను.. పురుషుల విభాగంలో అక్షర్ పటేల్ సెప్టెంబర్ నెలకు గాను ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డ్‌కి నామినేట్ అయ్యాడు. అతనితో పాటు పాకిస్థాన్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్, ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ కూడా నామినేట్ అయ్యాడు.
ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా.. అక్షర్ పటేల్ మొత్తం మూడు మ్యాచ్‌ల్లో కలుపుకొని 8 వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఇతడే. తొలి మ్యాచ్‌లో కేవలం 17 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీసిన ఇతడు.. రెండో మ్యాచ్‌లో రెండు వికెట్లు (8 ఓవర్ల మ్యాచ్), మూడో మూడు వికెట్లు తీశాడు. ఇదే సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటగాడు కామెరూన్ గ్రీన్ రెండు అర్థ శతకాలు బాదడంతో.. అతని పేరు నామినేట్ అయ్యింది. ఇక మహమ్మద్ రిజ్వాన్ విషయానికొస్తే.. గత పది మ్యాచుల్లో ఏడు అర్ధశతకాలు చేసి, మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆసియా కప్‌లోనూ 281 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఇక మహిళా క్రికెటర్ల నుంచి ఈ అవార్డ్‌కి ముగ్గురు నామినేట్ కాగా.. అందులో ఇద్దరు భారతీయులు ఉండటం విశేషం. వాళ్లే.. హర్మన్ ప్రీత్ కౌర్ & స్మృతి మందాన. ఇంగ్లండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియాను గెలిపించడంలో వీళ్లిద్దరు కీలక పాత్ర పోషించారు. ఇక వీరితో పాటు నామినేట్ అయిన మూడో క్రికెటర్.. బంగ్లాదేశ్ సారథి నిగర్ సుల్తానా.
