NTV Telugu Site icon

T20 World Cup: జింబాబ్వేపై టీమిండియా ఘనవిజయం.. సెమీస్‌లో ఇంగ్లండ్‌తో ఢీ

Arshdeep Singh

Arshdeep Singh

T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన నామమాత్ర మ్యాచ్‌లో పసికూన జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల టార్గెట్‌ బరిలోకి దిగిన జింబాబ్వేను భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్‌లోనే దెబ్బ కొట్టాడు. ఫస్ట్ బాల్‌కే మధెవెరేను వెనక్కి పంపాడు. తర్వాత జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి 115 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు. షమీ, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. ర్యాన్ బర్ల్ 35, సికిందర్ రజా 34 పరుగులతో రాణించారు. ఈ విజయంతో గ్రూప్-2లో టీమిండియా అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ ఖాతాలో 8 పాయింట్లు ఉన్నాయి.

Read Also: South Africa: దురదృష్టం అంటే ఇదే.. ఖాయం అనుకున్న సెమీస్ బెర్త్ చేజారింది

అంతకుముందు ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సూర్యకుమార్‌కు దక్కింది. అతడు 25 బంతుల్లో 6 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. తాజాగా గ్రూప్-2లో టీమిండియా అగ్రస్థానంలో ఉండటంతో గ్రూప్-1లో నెంబర్-2గా ఉన్న ఇంగ్లండ్‌తో నవంబర్ 10న అడిలైడ్ వేదికగా సెమీస్‌లో తలపడనుంది. ఇక గ్రూప్-1లో నెంబర్-1గా ఉన్న న్యూజిలాండ్.. గ్రూప్-2లో రెండో స్థానంలో ఉన్న పాకిస్థాన్‌తో నవంబర్ 9న పోటీ పడనుంది.