T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో సిడ్నీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగుల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 9 పరుగులకే అవుటయ్యాడు. అయితే మరో ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. వీళ్లిద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. నెదర్లాండ్స్ ఫీల్డర్లు రెండు సార్లు రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేశారు. దీంతో రోహిత్ చెలరేగి ఆడాడు. ఎక్కువ సిక్సర్లు కొట్టడానికే ప్రాధాన్యం ఇచ్చాడు. మరోవైపు కోహ్లీ నిదానంగా ఆడాడు. రోహిత్ (53) అవుటైనా సూర్యకుమార్ వచ్చి ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. అతడు 25 బంతుల్లోనే 51 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గత మ్యాచ్‌లో చివరి వరకు బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. ఈ మ్యాచ్‌లోనూ 62 నాటౌట్‌గా నిలిచాడు. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి టీమిండియా 179 పరుగులు చేసింది.
Read Also: T20 World Cup: ఆస్ట్రేలియాకు మరో షాక్.. స్టార్ వికెట్ కీపర్‌కు కరోనా
అనంతరం 180 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఏ దశలోనే గెలిచేలా కనిపించలేదు. ఆరంభంలో భువనేశ్వర్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. అతడు వేసిన తొలి రెండు ఓవర్లు మెయిడిన్ ఓవర్లు కావడం విశేషం. నెదర్లాండ్స్ బ్యాటర్లలో ప్రింగిల్ (20) టాప్ స్కోరర్ అంటే ఆ జట్టు ఎలా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, అశ్విన్ తలో రెండు వికెట్లు సాధించారు. షమీ ఓ వికెట్ తీశాడు. ఈ విజయంతో గ్రూప్-2లో టీమిండియా టాప్‌లో కొనసాగుతోంది. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా నిలిచింది. భారత్ ఖాతాలో 4 పాయింట్లు ఉండగా దక్షిణాఫ్రికా ఖాతాలో 3 పాయింట్లు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
