Site icon NTV Telugu

Ind Vs Zim: ధావన్, గిల్ హాఫ్ సెంచరీలు.. పసికూనపై వికెట్ పడకుండా కొట్టేశారు

Team India

Team India

Ind Vs Zim: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 190 పరుగుల విజయ లక్ష్యాన్ని ఊదిపడేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో 3 వికెట్లు తీసి జింబాబ్వేను కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో 190 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 30.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(81 నాటౌట్), శుభ్‌మన్ గిల్(82 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. గత నాలుగు మ్యాచ్‌లలో అటు ధావన్, ఇటు గిల్‌కు మూడో హాఫ్ సెంచరీ కావడం గమనించదగ్గ విషయం. వెస్టిండీస్ పర్యటనలోనూ ధావన్, గిల్ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీంతో వీళ్లిద్దరినే కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దింపి విజయం సాధించాడు.

Read Also: Yuzvendra Chahal: సమంత బాటలో చాహల్ భార్య.. అతడితో పార్టీకి హాజరుకావడమే కారణమా?

ధావన్ 113 బంతుల్లో 9 ఫోర్లు కొట్టి 81 పరుగులు చేయగా.. శుభ్‌మన్ గిల్ 72 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. ధావన్, శుభ్‌మన్ గిల్ రాణించడంతో తొలి వన్డేలో కేఎల్ రాహుల్‌కు అసలు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఐపీఎల్ తర్వాత టీమిండియా తరఫున కేఎల్ రాహుల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం కారణంగా దూరమైన అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమైంది. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలు ఆడాల్సి ఉండటంతో కేఎల్ రాహుల్ ఫామ్‌పైనే అందరి కళ్లు నెలకొన్నాయి.

Exit mobile version