జూలై 1 నుంచి టీమిండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య కీలకమైన ఐదో టెస్ట్ జరగనుంది. గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ టెస్టును ఈ ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు టీమిండియాకు ఊరట కలిగింది. కరోనా బారిన పడ్డ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తాజాగా కోలుకున్నాడు. గురువారం లీసెస్టర్ షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభానికి ముందు జట్టుతో పాటు ప్రాక్టీస్ సెషన్‌లో కూడా పాల్గొన్నాడు. ఈ మేరకు ప్రాక్టీస్ సెషన్‌లో అశ్విన్ పాల్గొన్న ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంతకుముందు ఇంగ్లండ్ పర్యటన కోసం భారత ఆటగాళ్లు జూన్ 16న ముంబై నుంచి లండన్ బయలుదేరగా అశ్విన్ మాత్రం ఇంగ్లండ్ విమానం ఎక్కలేదు. కరోనా కారణంగా అతడు ఇండియాలోనే ఉండిపోయాడు. ఐసోలేషన్ సహా అన్ని కోవిడ్ నిబంధనలు పూర్తి చేసిన అనంతరం అశ్విన్ ఇంగ్లండ్‌కు పయనం అయ్యాడు.
కాగా లీసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలిరోజు టీ సెషన్ సమయానికి టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు మాత్రమే చేసి కష్టాల్లో పడింది. రోహిత్ (25), కోహ్లీ (33), శుభ్‌మన్ గిల్ (21) పరుగులు చేశారు. హనుమా విహారి (3), శ్రేయస్ అయ్యర్ (0) తీవ్రంగా నిరాశపరిచారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 13 పరుగులు చేసి అవుటయ్యాడు. క్రీజులో శ్రీకర్ భరత్ (34), ఉమేష్ యాదవ్ (8) ఉన్నారు. లీసెస్టర్ షైర్ బౌలర్లలో రోమన్ వాకర్‌కు 5 వికెట్లు దక్కాయి.
Hello and welcome to Day 1 of our practice match against @leicsccc #TeamIndia pic.twitter.com/nUilsYz5fT
— BCCI (@BCCI) June 23, 2022