Smriti Mandhana-Harmanpreet Kaur Rift: భారత మహిళల క్రికెట్‌లో కెప్టెన్సీ మార్పు ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి రాజీనామా చేసిన తర్వాత స్మృతి మంధానకు జట్టు పగ్గాలు దక్కడం ఊహించిన పరిణామమే. అయితే ఈ మార్పు ఆలస్యంగా జరిగిందా?.. ఇంతకాలం హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య కెప్టెన్సీ విషయంలో విభేదాలు ఉన్నాయా? అనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. హర్మన్‌ప్రీత్ 2016లో భారత మహిళల జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించింది. దాదాపు దశాబ్దం పాటు జట్టుకు నాయకత్వం వహించిన ఆమె.. తాజాగా బీసీసీఐ నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి తప్పుకుంది. జపాన్‌లో జరిగిన 2026 ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండోసారి స్వర్ణ పతకం అందించిన తర్వాత హర్మన్‌ప్రీత్ తన కెప్టెన్సీ ప్రయాణానికి ముగింపు పలికింది.
10 వేలకు పైగా పరుగులు:
హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో స్మృతి మంధానను కెప్టెన్‌గా ఎంపిక చేయడం ఊహించిందే. 2013లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మంధాన.. ఇప్పటికే భారత క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా ఎదిగింది. మూడు ఫార్మాట్లలో కలిపి 10 వేలకు పైగా పరుగులు సాధించిన ఆమె.. ప్రస్తుతం భారత జట్టులో టాప్ బ్యాటర్లలో ఒకరిగా కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో నైపుణ్యంతో పాటు ఇటీవల తన ఆటలో దూకుడును కూడా పెంచుకుంది. ఇన్ని రోజులు వైస్ కెప్టెన్‌గా ఉన్న మంధాన.. ఇప్పుడు కెప్టెన్ అయింది.
సెలెక్టర్లపై అసంతృప్తితో మంధాన?:
కెప్టెన్సీ విషయంలో స్మృతి మంధాన కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ను భారత్ గెలిచి ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించినప్పటికీ.. కెప్టెన్సీలో ఎలాంటి మార్పు చేయకపోవడంపై ఆమెకు అసంతృప్తి ఉన్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ తాను భారత జట్టుకు నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంధాన చెప్పడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. మరోవైపు ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తర్వాత కూడా భారత్ పెద్ద టోర్నమెంట్లను గెలవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని మంధాన పేర్కొంది.
ముందుగానే సంకేతాలు:
వన్డే ప్రపంచ కప్ విజయానికి ముందు, తర్వాత వరుసగా రెండు టీ20 ప్రపంచ కప్‌లలో భారత్ ముందుగానే నిష్క్రమించడం జట్టు నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తింది. ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ మార్పు అవసరమనే చర్చ మొదలైంది. అయితే సెలెక్టర్లు అప్పట్లో కెప్టెన్సీ మార్పుపై నిర్ణయం తీసుకోలేదు. చివరకు గువాహటిలో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో హర్మన్‌ప్రీత్‌కు కెప్టెన్సీలో మార్పు అనివార్యమనే సంకేతాలు అందినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె స్వయంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
హర్మన్‌ప్రీత్, మంధాన మధ్య విభేదాలా?:
ఇదే సమయంలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన మధ్య కొంతకాలంగా సఖ్యత లేదనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో ఇద్దరూ మంచి అనుబంధంతో ఉండేవారని, అయితే కెప్టెన్సీ అంశం క్రమంగా వారి మధ్య విభేదాలకు కారణమైనట్లు కథనాలు పేర్కొంటున్నాయి. ‘కొంతకాలంగా ఇద్దరి అభిప్రాయాలు కలవడం లేదు. దాంతో డ్రెస్సింగ్ రూమ్‌లో అసౌకర్య వాతావరణం ఏర్పడింది’ అని ఓ జట్టు వర్గం పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఈ వ్యాఖ్యలపై హర్మన్‌ప్రీత్ లేదా మంధాన నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు. ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో భారత్ ముందుగానే నిష్క్రమించిన తర్వాత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఇదే అంశంపై స్పందించింది. మంధానకు రెండు, మూడు సంవత్సరాల క్రితమే వన్డే కెప్టెన్సీ అప్పగించి ఉండాల్సిందని ఆమె అభిప్రాయపడింది. స్మృతి ఇప్పటికీ వన్డే, టెస్టు కెప్టెన్‌గా కొనసాగవచ్చని.. టీ20 కెప్టెన్సీని షెఫాలీ వర్మ వంటి యువ ఆటగాళ్లకు అప్పగించవచ్చని మిథాలీ సూచించింది.
గతంలోనూ కెప్టెన్సీ మార్పు వివాదమే:
భారత మహిళల జట్టులో కెప్టెన్సీ మార్పు వివాదం ఇదే మొదటిసారి కాదు. 2022 ప్రపంచకప్ తర్వాత మిథాలీ రాజ్ నుంచి వన్డే కెప్టెన్సీ బాధ్యతలను హర్మన్‌ప్రీత్ కౌర్ స్వీకరించిన సమయంలోనూ ఇద్దరు సీనియర్ ఆటగాళ్ల మధ్య సంబంధాలు అంతగా సానుకూలంగా లేవనే చర్చ జరిగింది. ఆ సమయంలో జట్టులో వర్గ విభేదాలు ఏర్పడ్డాయనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నప్పటికీ.. ఆమె క్రీడాకారిణిగా మరో రెండు, మూడు సంవత్సరాలు కొనసాగాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కొత్త కెప్టెన్ మంధానతో కలిసి ఆమె ఎలా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. గత విభేదాలను పక్కనపెట్టి జట్టు ప్రయోజనాల కోసం ఇద్దరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది.
బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్‌పై బాధ్యతలు:
ఇక బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్‌పై బాధ్యతలు కూడా పెరగనున్నాయి. ఇటీవల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. హర్మన్‌ప్రీత్ వ్యక్తిగతంగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఇపుడు కెప్టెన్సీ ఒత్తిడి లేకపోవడంతో పూర్తి స్థాయి బ్యాటర్‌గా ఆమెపై అంచనాలు మరింత పెరగనున్నాయి. ఆ అంచనాలను అందుకోవాలంటే హర్మన్‌ప్రీత్ తన బ్యాటింగ్‌లో మళ్లీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తంగా మంధానకు కెప్టెన్సీ దక్కడం భారత మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. అయితే హర్మన్‌ప్రీత్‌తో ఆమెకు నిజంగానే విభేదాలు ఉంటే.. కొత్త కెప్టెన్‌గా మంధాన ఆ పరిస్థితిని ఎలా అధిగమిస్తుంది? అనేది రానున్న రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.

