Harshal Patel Injured Before Asia Cup: ఆసియా కప్ లాంటి మెగా టోర్నీకి ముందే టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా స్టార్ పేసర్ హర్షల్ పటేల్ జట్టుకు దూరమయ్యాడు. గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో సంచలన ప్రదర్శనతో 32 వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించిన హర్షల్ పటేల్.. టీ20 స్పెషలిస్ట్‌గా భారత జట్టులోకి వచ్చాడు. డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఆసియాకప్, టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో హర్షల్ పటేల్‌ను అందరూ కీలకంగా భావించారు. అయితే ఇటీవల పక్కటెముకల గాయంతో వెస్టిండీస్ పర్యటనకు ఎంపికైనా టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం నుంచి కోలుకోవాలంటే హర్షల్ పటేల్ మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని వైద్యులు సూచించినట్లు సమాచారం అందుతోంది.
Read Also: Rakshabandhan 2022: సోదరికి గిఫ్ట్‌ల గురించి ఆలోచిస్తున్నారా?.. ఈ బహుమతులు ఇవ్వండి
ఈ వార్త నిజమైతే హర్షల్ పటేల్ ఆసియా కప్‌కు మాత్రమే కాకుండా టీ20 ప్రపంచకప్‌కు కూడా దూరం కావాల్సి ఉంటుంది. ఈ నెలాఖరు నుంచి దుబాయ్‌లో ఆసియా కప్ జరగనుండగా అక్టోబర్ తొలివారంలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ప్రారంభం అవుతుంది. హర్షల్ పటేల్ జట్టుకు దూరం కావడంపై బీసీసీఐ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ వెస్టిండీస్ పర్యటన నుంచి అతడిని తప్పిస్తున్నట్లు బీసీసీఐ అధికారులు వెల్లడించారు. టీమిండియా తరపున టీ20ల్లో హర్షల్ పటేల్ ఇప్పటివరకు 17 మ్యాచులు ఆడి 23 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. మహ్మద్ షమీని సైతం పక్కకు నెట్టి టీ20ల్లో మూడో పేసర్‌గా జట్టులో స్థానాన్ని ఖరారు చేసుకున్నాడు. టీ20లకు సంబంధించి బుమ్రా, భువనేశ్వర్ టీమిండియా టాప్-2 పేసర్ల జాబితాలో ఉన్నారు. హర్షల్ పటేల్ గాయపడటంతో ఆసియా కప్‌లో యువ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ లేదా అవేష్ ఖాన్‌లలో ఒకరికి అవకాశం దక్కనుంది. ఒకవేళ దీపక్ చాహర్ అందుబాటులోకి వస్తే వీళ్లిద్దరినీ సెలక్టర్లు పక్కన పెట్టినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.
