Site icon NTV Telugu

Team India: మిస్టర్ 360 సూర్యకుమార్ ఖాతాలో మరో రికార్డు

Surya Kumar Yadav

Surya Kumar Yadav

Team India: టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో అతడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లోనూ సూర్యకుమార్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్‌లో ఒక్క ఏడాదిలో వెయ్యి పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా సూర్యకుమార్ అలియస్ మిస్టర్ 360 రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఆడిన అన్ని టీ20 సిరీస్‌లలో అతడు చెలరేగి ఆడాడు. ఇంగ్లండ్ గడ్డపై ఈ ఏడాదే టీ20 ఫార్మాట్‌లో తన తొలి శతకం నమోదు చేశాడు. కేవలం 48 బంతుల్లోనే శతకం సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినా.. సూర్యకుమార్ సత్తా ఎలాంటిదో అందరికీ తెలిసొచ్చింది.

Read Also: Andhra Pradesh: అమ్మాయిలతో చిందులు.. టెక్కలి ఎస్‌ఐపై వేటు

అనంతరం టీమిండియా పర్యటించిన వెస్టిండీస్‌ గడ్డపైనా సూర్యకుమార్ రాణించాడు. ఆసియా కప్‌‌తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో జరిగిన సిరీసుల్లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. టీ20 ప్రపంచకప్‌లో కూడా అదే జోరు కొనసాగిస్తున్న సూర్యకుమార్ యాదవ్.. కీలకమైన ఇన్నింగ్సులు ఆడుతున్నాడు. ఇప్పటికే మెగా టోర్నీలో మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై హాఫ్ సెంచరీలతో రాణించాడు. ఆదివారం జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 25 బంతుల్లోనే 61 పరుగులతో అజేయంగా నిలిచి భారత జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో 28 ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యకుమార్ మొత్తం 1,026 పరుగులు సాధించాడు. సగటు 44.60గా నమోదైంది. స్ట్రైక్ రేట్ అయితే 186.24గా ఉండటం గమనించాల్సిన విషయం. కాగా ఒకే ఏడాది టీ20 ఫార్మాట్‌లో వెయ్యి పరుగులు చేసిన రెండో క్రికెటర్ సూర్యకుమార్. గత ఏడాది పాకిస్థాన్ క్రికెటర్ మహ్మద్ రిజ్వాన్ 1,326 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రిజ్వాన్ యావరేజ్ 73.66గా ఉంది.

Exit mobile version