Site icon NTV Telugu

Team India: చరిత్ర సృష్టించిన భారత్.. సొంతగడ్డపై తిరుగులేని రికార్డు

సొంతగడ్డపై టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. గత పదేళ్లుగా టీమిండియా సొంతగడ్డపై ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించలేకపోయింది. ఈ నేపథ్యంలో స్వదేశంలో వరుసగా 15 సిరీస్‌లను గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. భారత్ తర్వాత స్వదేశంలో అత్యధిక టెస్ట్ సిరీస్‌లను గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఆసీస్ స్వదేశంలో వరుసగా 10 టెస్ట్ సిరీస్‌లను తమ ఖాతాలో వేసుకుంది. 1994 నవంబర్ నుంచి 2000 నవంబర్ మధ్యలో ఒకసారి, 2004 జూలై నుంచి 2008 నవంబర్ వరకు మరోసారి ఆసీస్ ఈ ఘనత సాధించింది.

అటు భారత్ చివరిసారిగా 2012లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓటమిపాలైంది. ధోనీ సారథ్యంలో ఈ పరాజయాన్ని జట్టు మూటగట్టుకుంది. అప్పటి నుంచి భారత్ స్వదేశంలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోలేదు. అంతేకాకుండా 2016 నుంచి అత్యధిక టెస్టులను గెలిచిన జట్టుగా కూడా టీమిండియా రికార్డు సాధించింది. 2016 నుంచి టీమిండియా మొత్తం 67 టెస్టులు ఆడగా 41 మ్యాచ్‌లలో గెలిచింది. 10 డ్రా కాగా 16 టెస్టుల్లో ఓడిపోయింది. ఈ జాబితాలో భారత్ తర్వాతి స్థానంలో ఇంగ్లండ్ ఉంది. ఇంగ్లండ్ 80 టెస్టులు ఆడి 33 మ్యాచ్‌లలో విజయం సాధించింది. 13 మ్యాచ్‌లను డ్రాగా ముగించగా 34 టెస్టుల్లో ఓటమిపాలైంది.

https://ntvtelugu.com/virat-kohli-average-falls-below-50-in-test-format/
Exit mobile version