NTV Telugu Site icon

IND vs AUS 2nd ODI: పేకమేడల్లా కూలిన భారత్.. 117 పరుగులకే ఆలౌట్

Ind Vs Aus

Ind Vs Aus

Team India Allout For 117 Against Australia In Second ODI: విశాఖపట్నంలోని డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్రికెట్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ పేకమేడల్లా కుప్పకూలింది. అత్యంత చెత్త బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చింది. కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయ్యింది. 31 పరుగులతో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతనితో పాటు అక్షర్ పటేల్ (29 నాటౌట్) పర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లందరూ ఘోరంగా నిరాశపరిచారు. గత వన్డే మ్యాచ్‌లో ఒంటరి పోరాటంతో టీమిండియాను గెలిపించిన కేఎల్ రాహుల్ సైతం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితం అవ్వగా.. అందులో నలుగురు డకౌట్ అయ్యారు. గత మ్యాచ్‌లో గోల్డెన్ డక్ అయిన సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్‌లోనూ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్య్లూగా ఔటయ్యాడు.

Manchu Mohan Babu: చిరంజీవితో గొడవలు.. ఎట్టకేలకు నోరువిప్పిన మోహన్ బాబు

తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకోవడంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత్ రంగంలోకి దిగింది. ఇన్నింగ్స్ ఆరంభమైన ఆదిలోనే భారత్‌కి గట్టి దెబ్బ తగిలింది. ఈమధ్య మంచి ఫామ్‌తో దూసుకెళ్తున్న శుభ్మన్ గిల్.. సున్నా పరుగులకే ఔటయ్యాడు. అనంతరం రోహిత్‌తో కలిసి విరాట్ కోహ్లీ భారత ఇన్నింగ్స్‌కి కాస్త ముందుకు నడిపించాడు. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కి 29 పరుగులు జోడించాడు. ఈ ఇద్దరు దాదాపు కుదురుకున్నట్టే కనిపించడంతో.. భారీ ఇన్నింగ్స్ ఆడుతారని అనుకున్నారు. కానీ.. 32 పరుగుల వద్ద రోహిత్ ఔట్ అవ్వడంతో అందరి ఆశలు నీరుగారిపోయాయి. అప్పుడు క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్.. అట్నుంచి అటే వెళ్లిపోయాడు. ఇక అప్పటినుంచి వరుసగా వికెట్లు ఏరులై పారాయి. ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేదు. అక్షర్ (29) ఇన్నింగ్స్ పుణ్యమా అని.. భారత్ 100 పరుగుల మైలురాయిని దాటగలిగింది. లేకపోతే.. ఆలోపే తట్టాబుట్టా సర్దేసింది.

Ukraine War: ఆక్రమిత ఉక్రెయిన్‌లో పుతిన్ ఆకస్మిక పర్యటన.. మారియోపోల్ సందర్శన

ఇక ఆస్ట్రేలియా బౌలింగ్ విషయానికొస్తే.. మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లతో విరుచుకుపడ్డాడు. ఓవైపు పరుగులు ఇస్తూనే, మరోవైపు కీలక వికెట్లు తీస్తూ వచ్చాడు. 8 ఓవర్లలో 53 పరుగులిచ్చిన స్టార్క్.. ఒక మెయిడెన్ ఓవర్ వేయడంతో పాటు ఐదు వికెట్లు తీశాడు. సీన్ అబాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. నథన్ ఎలిస్ రెండు వికెట్లు తీశాడు. ఆస్ట్రేలియా బౌలర్లు మొదటి నుంచి కట్టుదిట్టమైన బౌలింగ్ వేయడంతో.. 26 ఓవర్లలోనే భారత్ 117 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇప్పుడు భారమంతా భారత బౌలర్ల మీదే ఉంది. మన బౌలర్లు ఏదైనా మ్యాజిక్ చూపిస్తే తప్ప.. మ్యాచ్ గెలవడం దాదాపు అసాధ్యమే!

Show comments