CM Vijay: క్రికెట్, రాజకీయాల కలయికతో కూడిన ఒక ఊహించని ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ (నటుడు విజయ్), భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఆటోగ్రాఫ్ చేసిన బ్యాట్‌ను పట్టుకుని ఉన్న ఒక ఫొటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. క్రికెట్ అభిమానులతో పాటు, ఈ నటుడు-రాజకీయ నాయకుడి మద్దతుదారుల్లో ఇది తీవ్ర ఉత్సాహాన్ని నింపింది. ప్రముఖ టైర్ల తయారీ దిగ్గజం ‘MRF’ ఛైర్‌పర్సన్ కె.ఎమ్. మామెన్ తమిళనాడు ప్రభుత్వ అధికారులతో భేటీ అయిన సందర్భంగా ఈ బ్యాట్‌ను సీఎం విజయ్‌కు బహుమతిగా అందించారు. రాష్ట్రంలో సుమారు రూ.5,300 కోట్ల పెట్టుబడితో సరికొత్త గ్రీన్‌ఫీల్డ్ టైర్ల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు జరుగుతున్న చర్చల్లో భాగంగా ఈ సమావేశం జరిగింది.
ఈ వైరల్ ఫోటోలో సీఎం విజయ్ సూట్ ధరించి, భుజంపై సాంప్రదాయ వేష్టి (ధోవతి) వేసుకుని.. కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను గర్వంగా పట్టుకుని కనిపించారు. విజయ్‌కు క్రికెట్, ఐపీఎల్ (IPL) తో ఉన్న పాత అనుబంధం కారణంగా ఈ గిఫ్ట్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయ్ మొదటి నుంచీ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు పెద్ద సపోర్టర్. 2008 ఐపీఎల్ తొలి సీజన్‌లో సీఎస్‌కే బ్రాండ్ అంబాసిడర్‌గా సైతం వ్యవహరించారు. సీఎస్‌కే ఐకానిక్ ఎల్లో జెర్సీలో ఆయన గతంలో పలుమార్లు కనిపించి జట్టుపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. అంతేకాదు, చెన్నై మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కూడా విజయ్‌కు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. అలాంటి క్రికెట్ లవర్ అయిన ముఖ్యమంత్రికి కోహ్లీ సైన్ చేసిన బ్యాట్ దక్కడం ఒక ప్రత్యేకమైన విషయంగా మారింది.
