NTV Telugu Site icon

USA vs CAN: కెనడాపై సంచలన విజయం.. టీ20 ప్రపంచకప్‌లో అమెరికా బోణీ!

Aaron Jones

Aaron Jones

United States won by 7 wkts against Canada in T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024లో అమెరికా బోణీ కొట్టింది. డల్లాస్ వేదికగా ఆదివారం ఉదయం కెనడాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. కెనడా నిర్ధేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని యూఎస్ 17.4 ఓవర్లలో 3 వికెట్స్ కోల్పోయి 197 రన్స్ చేసి గెలిచింది. అమెరికా విజయంలో ఆండ్రిస్ గౌస్ (65; 46 బంతుల్లో 7×4, 3×6), ఆరోన్ జోన్స్ (94; 40 బంతుల్లో 4×4, 10×6) కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో గ్రూప్-ఏలో ఉన్న యూఎస్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ నవనీత్‌ ధాలివాల్‌ (61; 44 బంతుల్లో 6×4, 3×6), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నికోలస్ కిర్టన్ (51; 31 బంతుల్లో 3×4, 2×6) హాఫ్ సెంచరీలు చేశారు. శ్రేయాస్ మొవ్వ (32), ఆరోన్ జాన్సన్ (23) పర్వాలేదనిపించారు. అమెరికా బౌలర్లలో అలీ ఖాన్‌, హర్మీత్‌ సింగ్‌, కోరె ఆండర్సన్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు.

Also Read: Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ అభిమానులకు షాక్.. ఇండియన్ 2లో చందమామ లేదు!

ఛేదనలో అమెరికాకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్ స్టీవెన్ టేలర్ (0) డకౌట్ అయ్యాడు. కెప్టెన్ మోనాన్క్ పటేల్ (16) కూడా నిరాశపరిచాడు. ఈ సమయంలో ఆండ్రిస్ గౌస్, ఆరోన్ జోన్స్ జోడి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. 8 ఓవర్లకు యూఎస్ స్కోరు 48 మాత్రమే. అయితే ఆరోన్ విధ్వంసం సృష్టించడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ముఖ్యంగా సిక్సులతో విరుచుకుపడి కెనడా బౌలర్లకు చుక్కలు చూపించాడు.. దాంతో యూఎస్ లక్ష్యం వైపు దూసుకెళ్లింది. ఆఖర్లో ఆండ్రీస్ ఔటైనప్పటికీ.. కోరే అండర్సన్ (3)తో కలిసి జోన్స్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. టీ20 ప్రపంచకప్‌లో ఆడటం అమెరికాకు ఇదే మొదటిసారి.