NTV Telugu Site icon

IND vs IRE: ప్రపంచకప్‌ వేటకు వేళాయె.. నేడు ఐర్లాండ్‌తో భారత్ ఢీ!

India Vs Ireland

India Vs Ireland

T20 World Cup 2024 IND vs IRE Prediction and Playing 11: టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత్‌ తొలి పోరుకు సమయం ఆసన్నమైంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా బుధవారం ఐర్లాండ్‌ను టీమిండియా ఢీకొనబోతోంది. న్యూయార్క్‌లోని నాసౌవ్‌ కౌంటీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, డిస్నీ+హాట్‌స్టార్‌ యాప్‌లో లైవ్ మ్యాచ్ చూడొచ్చు. బలాబలాల్లో భారత్‌, ఐర్లాండ్‌కు పోలిక లేదు. కానీ ఐర్లాండ్‌ చిన్న జట్లలో పెద్ద జట్టు అని చెప్పొచ్చు. అప్పుడప్పుడూ పెద్ద జట్లకూ షాకులిస్తుంటుంది. కాబట్టి చిన్న జట్టన్న ఉదాసీనత రానివ్వకుండా.. రోహిత్ సేన తన స్థాయికి తగ్గట్లు ఆడి విజయం సాధించాల్సి ఉంది.

బంగ్లాదేశ్‌ వామప్‌ మ్యాచ్‌తో టీమిండియాకు మంచి ప్రాక్టీస్ దక్కింది. రోహిత్‌ శర్మ ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించాడు. వీరిద్దరు ఓపెనింగ్‌ చేస్తే.. సంజూ శాంసన్ వన్‌డౌన్‌లో దిగుతాడు. తర్వాతి రెండు స్థానాల్లో సూర్యకుమార్, శివమ్ దూబే, హార్దిక్‌ పాండ్యాలు ఆడనున్నారు. స్పిన్ పిచ్ కాబట్టి రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఆడనున్నారు. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మొహ్మద్ సిరాజ్‌ ఆడనున్నారు. పిచ్‌ స్పిన్‌కు ఎక్కువ అనుకూలం అనుకుంటే.. సిరాజ్‌ స్థానంలో యుజ్వేంద్ర చహల్‌ ఆడే అవకాశముంది. వీరందరూ ఐపీఎల్‌లో బాగా ఆడారు. భారత్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో విజయం ఖాయమే.

వన్డే ప్రపంచకప్‌ 2011లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఐర్లాండ్‌ సంచలనం సృస్టించింది. అందుకే అంతర్జాతీయ క్రికెట్లో ఎవ్వరూ ఆ జట్టును తేలిగ్గా తీసుకోవట్లేదు. టీ20ల్లో ఎక్కువగా ఆల్‌రౌండర్లతో నిండిన ఐర్లాండ్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. క్యాంఫర్, అడైర్, డెలానీ, డాక్రెల్, టెక్టార్, స్టిర్లింగ్‌ లాంటి ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. స్టిర్లింగ్‌ ఓపెనింగ్‌లో దూకుడుగా ఆడి మెరుపు ఆరంభాలనిస్తుంటాడు. కెప్టెన్‌ బాల్‌బిర్నీ కూడా ఫామ్‌లో ఉన్నాడు. టకర్, అడైర్‌ కూడా బ్యాటుతో సత్తా చాటగలరు. బౌలింగ్‌లో లిటిల్, యంగ్, అడైర్‌ కీలకంగా మారనున్నారు.

Also Read: MLC ByElection: నేడు నల్గొండ- వరంగల్- ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బైపోల్ కౌంటింగ్

తుది జట్లు (అంచనా):
భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లీ, శాంసన్, సూర్యకుమార్, దూబె, హార్దిక్, జడేజా, కుల్దీప్, బుమ్రా, అర్ష్‌దీప్, సిరాజ్‌/చహల్.
ఐర్లాండ్‌: బాల్‌బిర్నీ (కెప్టెన్‌), స్టిర్లింగ్, టెక్టార్, టకర్, డాక్రెల్, డెలానీ, క్యాంఫర్, అడైర్, మెకార్తీ, యంగ్, వైట్‌.