NTV Telugu Site icon

Suryakumar Yadav Fitnness: టీ20 ప్రపంచకప్‌ కోసం 15 కిలోలు తగ్గాడు.. 13 కిలోలు కొవ్వే!

Suryakumar Yadav Fitnness

Suryakumar Yadav Fitnness

Surya Kumar Yadav Looks Very Strong for T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌ 2024 నేడు ఆరంభమైంది. జూన్‌ 5న ఐర్లాండ్‌తో భారత్ తమ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. ప్రపంచకప్‌ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సిద్దమయ్యాడు. మునుపెన్నడూ లేనంత ఫిట్‌గా సూర్య కనిపిస్తున్నాడు. స్పోర్ట్స్‌ హెర్నియా శస్త్రచికిత్స తర్వాత పెరిగిన బరువును తగ్గించుకోవడమే అందుకు కారణం. పొట్టి ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని.. మిస్టర్ 360 సూర్య 15 కిలోల బరువు తగ్గాడు. అందుకోసం అత్యంత కఠినమైన ఆహార నియమాలను పాటించాడు.

2023 డిసెంబర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ చీలమండ శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ తర్వాత స్పోర్ట్స్‌ హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. స్పోర్ట్స్‌ హెర్నియా కారణంగా దాదాపుగా 4 నెలల పాటు మైదానంలోకి దిగలేదు. ఈ సమయంలో పెరిగిన బరువును తగ్గించుకునేందుకు చాలా కష్టపడ్డాడు. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ)లో పునరావాసం పొందిన సూర్య.. కసరత్తులు చేయడంతో పాటు ప్రత్యేక ఆహార నియమాలను పాటించాడు. అన్నం తినకుండా గోధుమ పిండితో కాకుండా ఇతర పిండితో చేసిన రొట్టెలు తిన్నాడు. ప్రోటీన్లు అధికంగా ఉండే ఎగ్స్, మాంసం, చేపలు తీసుకున్నాడు. పాల ఉత్పత్తులకు దూరంగా ఉన్న సూర్య.. కూరగాయలు, నట్స్, అవకాడోను తన ఆహారంలో భాగం చేసుకున్నాడు.

Also Read: Hardik Pandya: సులువుగా వదిలిపెట్టను.. చివరి వరకూ పోరాడేందుకే ప్రయత్నిస్తా!

సూర్యకుమార్‌ యాదవ్‌ బరువు తగ్గేందుకు సహాపడిన పోషకాహార నిపుణురాలు శ్వేత భాటియా మాట్లాడుతూ… ‘సూర్యకుమార్‌ ఇప్పుడు కాస్త బక్కగా, మరింత బలంగా కనిపిస్తున్నాడు. ఇందుకు కారణం ప్రత్యేక ఆహార నియమాలే. శస్త్రచికిత్స తర్వాత ఔషధాల కారణంగా సూర్య బరువు చాలా పెరిగింది. ఇప్పుడు అతడు 15 కిలోలు తగ్గగా.. ఇందులో 13 కిలోలు కొవ్వే ఉంది. సూర్య కోసం కఠినమైన ఆహార నియమాలను రూపొందించాం. ఎన్‌సీఏతో సమన్వయం చేసుకుని మేం పనిచేశాం. కోలుకునే అథ్లెట్లు అధిక క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, మాంసం, చేపలు, కూరగాయలు, నట్స్, అవకాడో తదితర ఆహారాన్ని సూర్యకు ఇచ్చాం’ అని తెలిపారు. ఎంతో ఫిట్‌గా ఉన్న సూర్య టీ20 ప్రపంచకప్‌లో ఎలాంటి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడతాడో చూడాలి.