NTV Telugu Site icon

ENG vs WI: చెలరేగిన సాల్ట్, బెయిర్‌స్టో.. సూపర్-8లో విండీస్‌ను చిత్తుచేసిన ఇంగ్లండ్!

England

England

England Crush West Indies in T20 World Cup 2024 Super 8: అష్టకష్టాలు పడి సూపర్‌-8కి చేరిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్.. కీలక సూపర్-8లో జూలువిదిల్చింది. సూపర్-8 తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య వెస్టిండీస్‌ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. విండీస్ నిర్ధేశించిన 181 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ జట్టు 17.3 ఓవర్లలోనే రెండు వికెట్స్ కోల్పోయి ఛేదించింది. ఫిలిప్ సాల్ట్ (87 నాటౌట్: 47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), జానీ బెయిర్‌స్టో (48 నాటౌట్: 26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ పరాజయంతో లీగ్‌ స్టేజ్‌లో ఎదురులేకుండా హవా కొనసాగించిన విండీస్‌కు బ్రేక్ పడింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. విండీస్‌కు మంచి ఆరంభమే దక్కింది. బ్రాండన్ కింగ్ (23), జాన్సన్ ఛార్లెస్ (38) శుభారంభం ఇచ్చారు. కింగ్ రిటైర్డ్ హర్ట్ అయ్యాక విండీస్ వేగంగా పరుగులు చేయలేకపాయింది. ఛార్లెస్, నికోలస్ పూరన్ (36) నెమ్మదిగా ఆడారు. రోవ్‌మన్ పావెల్ (36), షెర్ఫానె రూథర్‌ఫోర్డ్ (28) ధాటిగా ఆడడంతో విండీస్ భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్, అదిల్ రషీద్, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టోమ్ తలో వికెట్ తీశారు.

Also Read: SDGM: బాలీవుడ్ హీరోతో గోపీచంద్ మలినేని సినిమా.. జూన్ 22 నుంచి షూటింగ్!

లక్ష్య ఛేదనను ఇంగ్లండ్ ఘనంగా ప్రారంభించింది. ఓపెనర్లు ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ (25) తొలి వికెట్‌కు 67 పరుగులు జోడించారు. అయితే బట్లర్‌, మొయిన్ అలీ (13) స్వల్ప వ్యవధిలో ఔట్ అయ్యారు. అప్పటికి జట్టు స్కోరు 10.1 ఓవర్లకు 84/2. ఆ సమయంలో సాల్ట్‌కు కలిసి జానీ జత కలిశాడు. వీరిద్దరూ బౌండరీలతో చెలరేగారు. మూడో వికెట్‌కు 44 బంతుల్లోనే 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో ఇంగ్లండ్ 17.3 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. విండీస్‌ బౌలర్లలో ఆండ్రి రస్సెల్, రోస్టన్ ఛేజ్‌ చెరో వికెట్‌ తీశారు.