T20 World Cup Controversy: టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు చోటుచేసుకున్న వివాదంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. బంగ్లాదేశ్ జట్టు భారత్‌లో ఆడాలని భారతదేశం కోరుకుందని, పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, పాకిస్తాన్ ప్రభావంతోనే బంగ్లాదేశ్ తప్పుదారి పట్టిందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. 2026 ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించనున్నాయి. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తన నాలుగు గ్రూప్ మ్యాచ్‌లను భారత్‌లో ఆడాల్సి ఉంది. వీటిలో మూడు మ్యాచ్‌లు కోల్‌కతాలో, ఒక మ్యాచ్ ముంబైలో జరగాల్సి ఉంది. అయితే, భద్రతా కారణాలను చూపుతూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) భారత్‌కు జట్టును పంపేందుకు నిరాకరించింది. మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని డిమాండ్ చేయగా, ఐసీసీ ఆ అభ్యర్థనను తిరస్కరించింది. బంగ్లాదేశ్ తన నిర్ణయంపై మొండిగా ఉండటంతో చివరకు ఐసిసి కఠిన చర్యలకు దిగింది.
స్కాట్లాండ్‌కు అవకాశం
పదే పదే విజ్ఞప్తులు చేసినప్పటికీ బంగ్లాదేశ్ స్పందించకపోవడంతో, ఐసీసీ బంగ్లాదేశ్‌ను టోర్నమెంట్ నుంచి తప్పించింది. వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును గ్రూప్ సీలో చేర్చింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
రాజీవ్ శుక్లా కీలక వ్యాఖ్యలు
ఈ అంశంపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందిస్తూ, “మేం బంగ్లాదేశ్ ఆడాలని కోరుకున్నాం. పూర్తి భద్రత కల్పిస్తామని, ఎలాంటి సమస్యలు ఉండవని హామీ ఇచ్చాం. అయినా వారు భారత్‌లో ఆడబోమని తేల్చిచెప్పారు. చివరి నిమిషంలో షెడ్యూల్ మార్చడం సాధ్యం కాదు. అది వారి నిర్ణయం. అందుకే ఐసిసి స్కాట్లాండ్‌ను తీసుకువచ్చింది” అని అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ పాత్రను రాజీవ్ శుక్లా తీవ్రంగా ప్రశ్నించారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టింది. అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకుంటోంది. బంగ్లాదేశ్‌ను తప్పుదారి పట్టించడంలో పాకిస్తాన్ ప్రధాన పాత్ర పోషించింది. ఇది తప్పు అని విమర్శించారు.
బంగ్లాదేశ్ చరిత్రను ప్రస్తావించిన శుక్లా, “బంగ్లాదేశీయులపై పాకిస్తాన్ చేసిన దారుణాలు ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు వారిని సానుభూతితో మభ్యపెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు. మరోవైపు.. ఈ వివాదం మధ్య పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ భారత్–పాకిస్తాన్ మ్యాచ్‌ను బహిష్కరిస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి చర్యలు తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఐసీసీ ఇప్పటికే హెచ్చరించింది. అయితే, ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభమై మార్చి 8న ముగియనుంది. 2024 టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. ఈ టోర్నీలో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
