NTV Telugu Site icon

SA vs NEP: ఒకే ఒక్క పరుగు.. దక్షిణాఫ్రికాను వణికించిన పసికూన నేపాల్!

Sa Vs Nep

Sa Vs Nep

South Africa Beat Nepal By 1 Run Only: టీ20 ప్రపంచకప్‌ 2024లో టాప్ టీమ్ దక్షిణాఫ్రికాను పసికూన నేపాల్ వణికించింది. నరాలు తెగే ఉత్కంఠ మ్యాచ్‌లో చివరి బంతి వరకూ పోరాడింది. నేపాల్ సంచలన విజయం నమోదు చేసేలా కనిపించినా.. ఆఖరి బంతికి బోల్తాపడి ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. కింగ్స్‌టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 116 పరుగుల లక్ష్యాన్ని నేపాల్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 114 రన్స్ చేసి ఓడింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు చేతులెతేయడంతో ప్రొటీస్ తృటిలో ఓటమి నుంచి బయటపడింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవరల్లో 7 వికెట్లకు 115 పరుగులు చేసింది. రీజా హెండ్రిక్స్ (43; 49 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), ట్రిస్టన్ స్టబ్స్ (27 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. నేపాల్ బౌలర్లలో కుశాల్ (4/19) నాలుగు, దీపేంద్ర సింగ్ (3/21) మూడు వికెట్స్ పడగొట్టారు. దక్షిణాఫ్రికా స్టార్ బ్యాటర్లు డికాక్‌ (10), మార్‌క్రామ్‌ (15), క్లాసేన్ (3), మిల్లర్ (7) విఫలమయ్యారు.

Also Read: T20 World Cup 2024: హెల్మె‌ట్‌లో ఇరుక్కున్న బంతి.. చేత్తో పట్టుకుంటే ఔట్ ఇస్తారని ఏం చేశాడంటే?

ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఆసిఫ్ షేక్ (42; 49 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), అనిల్ సా (27; 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడారు. ప్రొటీస్ స్పిన్నర్ షంసీ (4/19) నాలుగు వికెట్స్ తీసి.. పసికూనను దెబ్బతీశాడు. నేపాల్ విజయానికి చివరి 6 బంతుల్లో 8 పరుగులు అవసరం అయ్యాయి. బార్ట్‌మన్ వేసిన చివరి ఓవర్ తొలి రెండు బంతులకు పరుగులేమి రాలేదు. గుల్షాన్ మూడో బంతికి ఫోర్ బాది.. నాలుగో బంతికి రెండు పరుగులు చేశాడు. దాంతో నేపాల్ జట్టుకు రెండు బంతుల్లో 2 పరుగులు అవసరం అయ్యాయి. అయిదో బంతిని పరుగు తీయని గుల్షాన్.. చివరి బంతికి రనౌట్ అయ్యాడు. దాంతో ఒక పరుగు తేడాతో నేపాల్ ఓడిపోయింది. ఈ విజయంతో గ్రూప్-డీలో అన్ని మ్యాచ్‌లను ప్రొటీస్ గెలిచింది.