Who Is American Cricketer Saurabh Netravalkar: టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్‌పై అమెరికా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ముందుగా ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టై కాగా.. ఆపై సూపర్ ఓవర్‌లో యూఎస్ అద్భుత విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణించిన అమెరికా.. ఊహించని విజయాన్ని అందుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే అమెరికా విజయంలో ఓ భారత హీరో ఉన్నాడు. 14 ఏళ్ల క్రితం తన బౌలింగ్‌తో పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన అతడు.. ఇప్పుడు మళ్లీ చెమటలు పట్టించాడు. ఎంతో ఒత్తిడిలోనూ అద్భుతంగా బౌలింగ్ చేసి.. అమెరికాకు సూపర్ విక్టరీ అందించాడు. అతడు మరెవరో కాదు.. ముంబైలో పుట్టి పెరిగిన సౌరభ్ నేత్రావల్కర్. ఇంతకీ ఈ సౌరభ్ ఎవరో తెలుసుకుందాం.
1991 అక్టోబరు 16న ముంబైలో సౌరభ్ నేత్రావల్కర్ జన్మించాడు. చిన్నప్పటి నుంచే అతడికి క్రికెట్‌పై ఆసక్తి ఎక్కువ. ఎంతో కస్టపడి భారత్ అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు. 2010లో అండర్-19 భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. భారత సీనియర్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, జయ్‌దేవ్ ఉనద్కత్, సందీప్ శర్మ, హర్షల్ పటేల్ వంటి ఆటగాళ్లతో కలిసి ఆడాడు. కొంతకాలం ముంబైకి రంజీల్లో ప్రాతినిధ్యం వహించాడు. అయితే భారత్‌లో తీవ్రమైన పోటీ కారణంగా టీమిండియాలో చోటు దక్కించుకోలేకపోయాడు.
భారత్ జాతీయ జట్టుకు ఆడే అవకాశాలు రాకపోవడంతో సౌరభ్ నేత్రావల్కర్ తిరిగి చదువుపై దృష్టి సారించాడు. 23 ఏళ్ల వయసులో 2015లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కార్నెల్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేసి.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరాడు. జాబ్ చేస్తున్నా.. ఆటపై ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు. అక్కడ టోర్నీలు ఆడుతూ సత్తాచాటాడు. ఎట్టకేలకు 2019లో అమెరికా తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. యూఏఈపై సౌరభ్ తొలి మ్యాచ్ ఆడాడు. ఆపై యూఎస్ జట్టుకు కొంతకాలం కెప్టెన్‌గా వ్యవహరించాడు.
Also Read: Today Gold Rate: షాకిస్తున్న బంగారం ధరలు.. తులం గోల్డ్ రేటు ఎంతుందో తెలుసా?
టీ20 ప్రపంచకప్ 2024లో అమెరికా తరఫున ఆడేందుకు సౌరభ్ నేత్రావల్కర్‌కు అవకాశం దక్కింది. కెనడాలో జరిగిన మ్యాచ్‌లో 2 ఓవర్లు వేసి 16 రన్స్ ఇచ్చాడు. పాకిస్థాన్‌పై మాత్రం చెలరేగాడు. తన కోటా నాలుగు ఓవర్లలో 18 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ పడగొట్టాడు. అంతేకాదు సూపర్ ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి 13 రన్స్ ఇచ్చి అమెరికాకు అద్భుత విజయాన్ని అందించాడు. దాంతో సౌరభ్ పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు అమెరికా తరఫున 48 వన్డేలు, 29 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. ప్రపంచకప్ టోర్నీకి ప్రాతినిథ్యం ఇస్తున్న నేపథ్యంలో అమెరికా నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే.