NTV Telugu Site icon

SA vs ENG: ఇంగ్లండ్‌పై విజయం.. టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌కు దక్షిణాఫ్రికా!

South Africa

South Africa

South Africa Beat England in T20 World Cup 2024 Super-8: టీ20 ప్రపంచకప్‌ 2024లో దక్షిణాఫ్రికా వరుస విజయాలు సాధిస్తోంది. లీగ్ దశను అజేయంగా ముగించిన ప్రొటీస్.. అదే హవాను సూపర్‌-8లోనూ కొనసాగిస్తోంది. సూపర్‌-8 తొలి మ్యాచ్‌లో అమెరికాపై గెలిచిన దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌పై గెలుపొందింది. సెయింట్ లూసియా వేదికగా శుక్రవారం అర్ధరాత్రి ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై 7 పరుగుల తేడాతో నెగ్గింది. సూపర్‌-8లో రెండు వరుస విజయాలతో ప్రొటీస్ టీమ్ దాదాపుగా సెమీస్‌కు దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. తొలి ఓవర్లో ఆచితూచి ఆడిన డికాక్‌ (65; 38 బంతుల్లో 4×4, 4×6) ఆ తర్వాత బాదుడు మొదలెట్టాడు. దాంతో పవర్‌ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో హెండ్రిక్స్‌ (19) మాత్రం నెమ్మదిగా బ్యాటింగ్‌ చేశాడు. పవర్‌ప్లే అనంతరం స్పిన్నర్ల రంగప్రవేశంతో స్కోరు వేగం తగ్గింది. కొద్ది వ్యవధిలో హెండ్రిక్స్‌, డికాక్‌ సహా ప్రమాదకర క్లాసెన్‌ (8), మార్‌క్రమ్‌ (1) వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా కష్టాల్లో పడింది. చివరి ఓవర్లలో మిల్లర్‌ (43; 28 బంతుల్లో 4×4, 2×6) చెలరేగి ఆడడంతో దక్షిణాఫ్రికా మెరుగైన స్కోరు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో ఆర్చర్‌ (3/40) ఆకట్టుకున్నాడు.

Also Read: Apple School Sale 2024: ‘యాపిల్‌’ స్కూల్‌ సేల్‌.. ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌లపై భారీ డిస్కౌంట్!

ఛేదనలో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులే చేసి ఓడింది. సాల్ట్‌ (11) రెండో ఓవర్లోనే వెనుదిరగ్గా.. బెయిర్‌స్టో (16) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. బట్లర్‌ (17), మొయిన్‌ అలీ (9) కూడా ఔట్ అవ్వడంతో ఓటమి తప్పదనిపించింది. ఈ సమయంలో హ్యారీ బ్రూక్‌ (53; 37 బంతుల్లో 7×4), లియామ్ లివింగ్‌స్టన్‌ (33; 17 బంతుల్లో 3×4, 2×6)లు జట్టును ఆదుకున్నారు. ఇంగ్లీష్ జట్టు విజయానికి చివరి 3 ఓవర్లలో 25 పరుగులే అవసరం అవవ్వడంతో విజయం ఖాయం అనుకున్నారు. రబాడ అద్భుతంగా బౌలింగ్ చేసి లివింగ్‌స్టన్‌ను ఔట్ చేసి 4 రన్స్ మాత్రమే ఇచ్చాడు. 19వ అవర్లో జాన్సెన్ 9 రన్స్ ఇవ్వగా.. చివరి ఓవర్లో నోకియా 6 పరుగులే ఇచ్చాడు.