NTV Telugu Site icon

Rohit Sharma Trolls: రెండు నిమిషాల ‘మ్యాగీ మ్యాన్’ అని రోహిత్ శర్మను ట్రోల్ చేశారు!

Rohit Sharma

Rohit Sharma

Rohit Sharma is also a victim of Body Shaming Said Abhishek Nayar: కెరీర్ ఆరంభంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బరువును ఉద్దేశించి చాలామంది ట్రోల్ చేశారని భారత మాజీ ప్లేయర్ అభిషేక్ నాయర్ తెలిపారు. ముఖ్యంగా రోహిత్ పొట్టను ఉద్దేశించి ‘రెండు నిమిషాల మ్యాగీ మ్యాన్’ అంటూ ట్రోల్ చేసేవారన్నారు. బాడీ షేమింగ్ చేసినా.. రోహిత్ ఏనాడూ కృంగిపోలేదని, మరింత కసిగా కష్టపడి స్టార్ బ్యాటర్‌గా ఎదిగాడని అభిషేక్ పేర్కొన్నారు. టీ20 ప్రపంచకప్‌ 2007తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్.. ఫిట్‌నెస్ సమస్యలు, పేలవ ప్రదర్శనతో భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో 2011 వన్డే ప్రపంచకప్‌కు ఎంపిక కాలేదు. ఆపై దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటిన రోహిత్‌కు అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఓపెనర్‌గా అవకాశం ఇవ్వడంతో.. తానేంటో నిరూపించుకున్నాడు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను అభిషేక్ నాయర్ పంచుకున్నారు. ‘వన్డే ప్రపంచకప్ 2011లో రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. అప్పుడు నేను రోహిత్‌తోనే ఉన్నాను. ఆ సమయంలో రోహిత్ బరువు ఎక్కువగానే ఉన్నాడు. ప్రపంచకప్ సమయంలో యువరాజ్ సింగ్‌తో కలిసి రోహిత్ ఓ యాడ్‌లో నటించాడు. ఆ యాడ్‌ను నేను ఎప్పటికీ మరిచిపోను. యాడ్‌లోని రోహిత్ విజువల్ కట్ చేసి.. అతని పొట్ట చుట్టూ ఓ గీత గీసి ట్రోల్ చేశారు. అది చూసిన నాకు చాలా బాధేసింది’ అని అభిషేక్ తెలిపారు.

Also Read: BCCI-Gautam Gambhir: ఇంటర్వ్యూకు హాజరైన గౌతమ్‌ గంభీర్‌.. ఓ రౌండ్‌ ముగిసింది!

‘ట్రోల్స్ చూశాక ఫిట్‌నెస్ విషయంలో నువ్ చాలా కష్టపడాలని రోహిత్ శర్మకు సలహా ఇచ్చాను. నువ్ ఏం చెబితే అదే చేస్తా అని హిట్‌మ్యాన్ నాతో అన్నాడు. ఐపీఎల్ తర్వాత ఓ కొత్త రోహిత్‌కు చూస్తావని చెప్పాడు. తాను అన్నది చేసి చూపించాడు. అందుకు చాలా కష్టపడ్డాడు. హిట్‌మ్యాన్‌గా గుర్తింపు పొందాడు. కెరీర్ పట్ల అతడి ఆలోచన ధోరణి పూర్తిగా మారిపోయింది. ఎంతో సక్సెస్ సాధించాడు. రెండు నిమిషాల మ్యాగీ మ్యాన్ అంటూ హేళన చేసిన వారికి అతడు బ్యాట్‌తోనే బదులిచ్చాడు. ఇప్పుడు సారథిగా ఉన్నాడు. చాలా సంతోషంగా ఉంది’ అభిషేక్ నాయర్ చెప్పుకొచ్చారు.