Site icon NTV Telugu

వెస్టిండీస్‌పై 20 పరుగుల తేడాతో శ్రీలంక విజయం

టీ-20 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌పై శ్రీలంక ఘన విజయం సాధించాయి. బంగ్లాపై భారీ విజయంతో మరోసారి సెమీస్‌ రేసులోకి దూసుకొచ్చింది ఆసీస్‌. వరుసగా ఐదు ఓటమితో బంగ్లా పులులు టోర్నీ నుంచి నిష్ర్కమించారు.బంగ్లాదేశ్‌పై 8 వికెట్ల తేడాతో అస్ట్రేలియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌.. 73 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బౌలర్‌ ఆడమ్ జంపా ధాటికి బంగ్లా హడలెత్తిపోయింది. 19 పరుగులు ఇచ్చిన జంపా 5 వికెట్లు తీసి బంగ్లా ఓటమిని శాసించాడు.

ఆ తరువాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌.. కేవలం 6.2 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించింది. ఆరోన్‌ ఫించ్‌, డేవిడ్‌ వార్నర్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో సునాయాసంగా గెలుపొందింది. కీలకమైన నెట్‌ రన్‌రేట్‌ను పెంచుకుంది. బంగ్లాదేశ్‌పై భారీ విజయంతో ఆస్ట్రేలియా సెమీస్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. సూపర్‌ 12 గ్రూప్‌-1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్‌ సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకోగా.. రెండో స్థానం కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా పోటీ పడుతున్నాయి.

అయితే ఉత్తమ రన్‌రేట్‌తో ఆసీస్‌ రెండో స్థానానికి చేరుకుంది.మరోవైపు టీ-20 ప్రపంచకప్‌లో తన చివరి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించింది. వెస్టిండీస్‌ను 20 పరుగుల తేడాతో చిత్తు చేసింది. మొదట టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంక.. 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఆ తరువాత వెస్టిండీస్‌ టార్గెట్‌ ఛేజింగ్‌లో విఫలమైంది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసి ఓటమి పాలైంది.శ్రీలంక జట్టుకు ఇదే చివరి మ్యాచ్. మొదటి దశలో శ్రీలంకకు కేవలం రెండు విజయాలే దక్కాయి. దీంతో ఆ జట్టు ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెస్టిండీస్ కూడా ఈ ఓటమితో టీ-20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది.

Exit mobile version