Site icon NTV Telugu

T20 World Cup 2026 Tickets: డెడ్ చీప్‌గా ప్రపంచకప్‌ టికెట్లు.. అస్సలు ఊహించలేరు, బుకింగ్స్ ఓపెన్!

T20 World Cup 2026 Tickets

T20 World Cup 2026 Tickets

2026 T20 World Cup Ticket Booking: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ 2026కి సంబంధించిన ఫేజ్–1 టికెట్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 11 సాయంత్రం 6.45 గంటల నుంచి అధికారికంగా టికెట్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. భారత్‌లో టికెట్‌ ధరలు కేవలం రూ.100 నుంచి మొదలవుతున్నాయి. శ్రీలంకలో LKR 1000 (సుమారు రూ.270) నుంచి టికెట్ ధరలు మొదలవుతాయి. మొదటి విడతలో 20 లక్షలకు పైగా టికెట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. ఫేజ్–2 టికెట్ వివరాలను ఐసీసీ త్వరలో ప్రకటించనుంది. భారత్–శ్రీలంక సంయుక్తంగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు మెగా టోర్నమెంట్‌ జరగనుంది.

ప్రతి క్రికెట్ అభిమానికి వినోదం అందించాలన్న లక్ష్యంతో తక్కువ ధరకే టికెట్లను అమ్ముతున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడుతూ… ‘రూ.100, LKR 1000 నుంచి టికెట్లు ప్రారంభించడం మా వ్యూహంలో కీలక భాగం. ప్రపంచంలో ఎక్కడున్నా, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా ప్రతి క్రికెట్ అభిమానికి స్టేడియంలో వరల్డ్ క్లాస్ క్రికెట్ అనుభవం అందాలి. ఈ వరల్డ్ కప్‌ను ప్రతి అభిమానికి అత్యంత చేరువయ్యే ఐసీసీ ఈవెంట్‌గా మార్చడం మా లక్ష్యం’ అని చెప్పారు. రూ.100 నుంచి టికెట్లు లభించడంతో అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగిందని, భారతీయుల క్రికెట్ ప్యాషన్‌కు తగ్గట్లుగా ప్రపంచ స్థాయి మ్యాచ్ అనుభవం అందించడానికి సిద్ధమవుతున్నాం అని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు.

Also Read: Suryakumar Yadav: ప్లాన్ బీ లేదు.. ఓటమికి నేనే బాధ్యుడిని!

‘భారత్‌తో కలిసి ఈ ప్రతిష్టాత్మక టోర్నీని నిర్వహించడం మాకు గర్వకారణం. అభిమానులు స్టేడియాలకు భారీగా తరలివస్తారని ఆశిస్తున్నాం. ఫేజ్–1 టికెట్లు ఓపెన్ అయ్యాయి, వెంటనే బుక్ చేసుకోండి’ అని శ్రీలంక క్రికెట్ సీఈఓ అష్లీ డి సిల్వా చెప్పుకొచ్చారు. భారత్, శ్రీలంకలోని ఎనిమిది స్టేడియాల్లో ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. టోర్నమెంట్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా.. 55 మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూప్ స్టేజ్ తర్వాత నాకౌట్ దశ, సెమీస్, ఫైనల్‌తో ఈ టోర్నీ సాగనుంది.

భారత్ మైదానాలు :
# నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
# ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై
# అరుణ్ జేట్లీ స్టేడియం, ఢిల్లీ
# వాంఖేడే స్టేడియం, ముంబై
# ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా

శ్రీలంక మైదానాలు:
# ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో
# సింగహలీస్ స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్, కొలంబో
# పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, కాండీ

Exit mobile version