Site icon NTV Telugu

T20 WC 2026 Semi Final Schedule: సెమీస్‌ షెడ్యూల్‌.. భారత్‌ ప్రత్యర్థి, వేదిక డీటెయిల్స్ ఇవే!

India Vs England Semi Final

India Vs England Semi Final

T20 World Cup 2026 Semi Final Schedule: భారత్, శ్రీలంకలు వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌ 2026 చివరి అంకానికి చేరింది. వారం రోజులుగా రసవత్తరంగా సాగిన సూపర్-8 షెడ్యూల్ ముగిసింది. అత్యుత్తమంగా ఆడిన నాలుగు టీమ్స్ సెమీఫైనల్‌ చేరాయి. సూపర్‌-8 గ్రూప్‌-1 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ సెమీస్ చేరగా.. గ్రూప్‌-2 నుంచి ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరాయి. మార్చి 4, 5న సెమీఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. సెమీస్‌ షెడ్యూల్‌ ఓసారి చూద్దాం.

గ్రూప్‌-1లో దక్షిణాఫ్రికా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. 6 పాయింట్లతో టాప్‌లో నిలిచింది. సూపర్‌-8లో భారత్‌, వెస్టిండీస్‌, జింబాబ్వేలను సఫారీ టీమ్ ఓడించింది. భారత్‌ ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి.. 4 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దక్షిణాఫ్రికాపై ఓడిన భారత్.. జింబాబ్వే, వెస్టిండీస్‌పై విజయం సాధించింది. వెస్టిండీస్‌ 3 మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచి 2 పాయింట్లు, జింబాబ్వే అన్ని మ్యాచ్‌ల్లోనూ ఓడి 0 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

గ్రూప్‌-1లో ఇంగ్లాండ్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. న్యూజిలాండ్‌, పాకిస్థాన్, శ్రీలంకలపై గెలిచి 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌ మూడు మ్యాచ్‌ల్లో ఒకటి గెలిచి (శ్రీలంక), మరొకటి (ఇంగ్లాండ్) ఓడింది. పాకిస్థాన్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. 3 పాయింట్లతో కివీస్ రెండో స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ ఒకటి గెలిచి, మరొకటి ఓడినా.. కివీస్ కంటే తక్కువ రన్ రేట్ కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. శ్రీలంక మ్యాచ్‌ల్లోనూ ఓడి చెత్త ప్రదర్శన చేసింది.

మార్చి 4 తొలి సెమీఫైనల్‌ జరగనుంది. కోల్‌కతా వేదికగా న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. మార్చి 5న రెండో సెమీఫైనల్‌ జరగనుంది. ముంబైలో భారత్‌, ఇంగ్లాండ్‌ టీమ్స్ ఢీకొట్టనున్నాయి. రెండు మ్యాచ్‌లు రాత్రి 7 గంటలకు ఆరంభం కానున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ మార్చి 8న నరేంద్ర మోడీ మైదానంలో జరగనుంది.

టీ20 ప్రపంచ కప్‌ 2026 సెమీస్‌ షెడ్యూల్‌:
# మార్చి 4: తొలి సెమీఫైనల్‌
న్యూజిలాండ్‌ vs దక్షిణాఫ్రికా
వేదిక: కోల్‌కతా
సమయం: రాత్రి 7 గంటలకు

# మార్చి 5: రెండో సెమీఫైనల్‌
భారత్‌ vs ఇంగ్లాండ్‌
వేదిక: ముంబై
సమయం: రాత్రి 7 గంటలకు

Exit mobile version