NTV Telugu Site icon

T20 World Cup Semi-Final: భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య కీలక ఫైట్.. గెలిస్తేనే ఫైనల్‌ లేదంటే ఇంటికే..

T20 World Cup

T20 World Cup

టీ20 వరల్డ్‌కప్‌లో సూపర్‌ ఫైట్‌కు సిద్ధమైంది టీమిండియా.. సెమీస్‌లో ఇవాళ ఇంగ్లాండ్‌తో తలపడనుంది.. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు దూసుకెళ్లనుండగా.. ఓడితే మాత్రం ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.. వరుస విజయాలతో దూకుడుమీదున్న రోహిత్‌ సేవ.. ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో బరిలోకి దిగుతుంది.. ఇక, 15 ఏళ్ల క్రితం టీ20 వరల్డ్‌కప్‌ను కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ సారి ఎలాగైనా కప్‌ కొట్టాల్సిందేనన్న పట్టుదలతో ఉంది.. ఇవాళ్టి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌డ్‌ను మట్టికరిపించి ఫైనల్‌కు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటి వరకు అన్ని మ్యాచ్‌లలో టీమిండియా అదరగొట్టింది.. అటు ఇంగ్లాండ్‌ జట్టు కూడా దుమ్మురేపుతోంది.. దీంతో.. అడిలైడ్‌లో హైఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగడం కాయంగా కనిపిస్తోంది.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

మరోవైపు.. ఇప్పటికే టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది పాకిస్థాన్‌.. సెమీస్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుచేసి టైటిల్‌ పోరుకు సిద్ధమైంది. తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌ – పాకిస్థాన్‌ మధ్య హోరా హోరీ మ్యాచ్‌ జరిగింది.. అనూహ్య పరిస్థితుల్లో సెమీస్‌ చేరిన పాక్‌.. ఈ మ్యాచ్‌లో మాత్రం బ్యాటింగ్‌, బౌలింగ్‌తో దుమ్మురేపింది.. అయితే మొదట బ్యాటింగ్‌ చేసిన నాలుగు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.. తర్వాత ఛేజింగ్‌కు దిగిన పాకిస్థాన్.. మొదటి నుంచి దూకుడుగా ఆడింది.. ఓపెనర్లు చెలరేగిపోయారు.. కేవలం మూడు వికెట్లను మాత్రమే నష్టపోయి.. 19.1 ఓవర్లలోనే 153 పరుగులు చేసి విజయాన్ని అందుకుని.. ఫైనల్‌లో అడుగుపెట్టారు. మొత్తంగా ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్‌ పతాక సన్నివేశానికి చేరుకుంది. దాదాపు నెలరోజులుగా అభిమానులను అలరిస్తూ వస్తున్న మెగాటోర్నీలో ప్రపంచ విజేత ఎవరో మరో రెండు మ్యాచ్‌ల్లో తేలనుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌ను ఓడించిన పాకిస్థాన్‌ ఫైనల్‌ చేరగా, ఇంగ్లాండ్‌తో అమీతుమీకి భారత్‌ అస్త్రశస్ర్తాలతో రెడీ అయిపోయింది.. అన్నీ అనుకూలిస్తే అడిలైడ్‌లో రోహిత్‌సేన కొత్త చరిత్ర లిఖించడం ఖాయంగా కనిపిస్తున్నది.

ఐసీసీ మెగాటోర్నీల్లో నాకౌట్‌ బలహీనతకు చరమగీతం పాడుతూ ఫైనల్లోకి దూసుకెళ్లాలని టీమ్‌ఇండియా ఆరాటపడుతున్నది. సూపర్‌-12లో వరుస విజయాల జోరును కొనసాగిస్తూ కీలకమైన సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించేందుకు భారత్‌ పక్కా స్కెచ్‌ వేస్తోంది.. మరోవైపు మెగాటోర్నీలో పడుతూలేస్తున్న ఇంగ్లాండ్‌ ఇప్పటి వరకు స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించలేకపోయింది. ఐర్లాండ్‌తో అనూహ్య ఓటమితో కంగుతిన్న బట్లర్‌ గ్యాంగ్‌.. న్యూజిలాండ్‌, శ్రీలంకపై విజయాలతో నాకౌట్‌ బెర్తు దక్కించుకుంది. ఆల్‌రౌండర్లతో పేపర్‌పై బలంగా కనిపిస్తున్న ఇంగ్లీష్‌ జట్టు.. టీమిండియాకు పోటీనిచ్చేందుకు పావులు కదుపుతున్నది. ఈ మ్యాచ్‌లో భారత్‌: రోహిత్‌శర్మ (కెప్టెన్‌), రాహుల్‌, కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌పాండ్యా, కార్తీక్‌/పంత్‌, అక్షర్‌పటేల్‌, అశ్విన్‌, భువనేశ్వర్‌, షమీ, అర్ష్‌దీప్‌సింగ్‌తో బరిలోకి దిగే అవకాశం ఉండగా.. ఇంగ్లండ్‌ మాత్రం బట్లర్‌(కెప్టెన్‌), హేల్స్‌, మలన్‌/సాల్ట్‌, స్టోక్స్‌, బ్రూక్‌, లివింగ్‌స్టోన్‌, మోయిన్‌ అలీ, సామ్‌ కరాన్‌, వోక్స్‌, జోర్డాన్‌, అదిల్‌ రషీద్‌కు తుది జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది.