Arshdeep Singh: డారిల్ మిచెల్‌కు క్షమాపణ చెప్పా.. నేను కావాలని కొట్టలేదు!

  • అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • నేను కావాలని డారిల్ మిచెల్‌ను కొట్టలేదు
  • బంతి ఎక్కువగా రివర్స్ స్వింగ్ అయ్యి తాకింది
Daryl Mitchell Arshdeep Singh

Daryl Mitchell Arshdeep Singh

Arshdeep Singh Apologizes to Daryl Mitchell in IND vs NZ Final: టీ20 ప్రపంచకప్ 2026 విజయం అనంతరం భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో జరిగిన సంఘటనపై మాట్లాడుతూ.. న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచెల్‌కు తాను క్షమాపణ చెప్పానని వెల్లడించాడు. ఉద్దేశపూర్వకంగా మిచెల్‌ను బంతితో కొట్టలేదని స్పష్టం చేశాడు. తాను విసిరిన త్రో కొంచెం ఎక్కువగా రివర్స్ స్వింగ్ అయ్యి అతడి శరీరాన్ని తాకిందని అర్ష్‌దీప్ తెలిపాడు.

ఫైనల్ మ్యాచ్‌లో డారిల్ మిచెల్‌పైకి అర్ష్‌దీప్ సింగ్ బంతిని విసరడం వివాస్పదంగా మారింది. అర్ష్‌దీప్ 11వ ఓవర్ వేయగా.. డారిల్ మిచెల్‌ సిక్స్‌లు బాదాడు. దాంతో సహనం కోల్పోయిన అర్ష్‌దీప్.. కోపంతో బంతిని వికెట్ల‌ వైపు కొట్టాడు. అది మిచెల్‌ తొడకు బలంగా తాకింది. దాంతో మిచెల్‌ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. గట్టిగా అరుస్తూ అర్ష్‌దీప్ వైపు దూసుకొచ్చాడు. అంతలోనే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకొని మిచెల్‌కు క్షమాపణలు చెప్పాడు. మరోవైపు ఫీల్డ్ అంపైర్ అర్ష్‌దీప్ ను మందలించాడు. ఆ ఓవర్ ముగిసిన వెంటనే మిచెల్‌కు అర్ష్‌దీప్ స్వయంగా క్షమాపణలు చెప్పాడు. దాంతో ఆ వివాదానికి తెరపడింది.

రెండు ప్రపంచ కప్‌లు గెలవడం ఎలా అనిపిస్తుందన్న ప్రశ్నకు అర్ష్‌దీప్ సింగ్ స్పందిస్తూ.. ప్రస్తుతం తన భావోద్వేగాలను పూర్తిగా అదుపు చేసుకోలేకపోతున్నానని అన్నాడు. ఈ క్షణంలో జట్టు గెలిచిన ఆనందం మాత్రమే అనిపిస్తోందని, రెండు మూడు రోజుల తర్వాత అసలు భావోద్వేగం ఏమిటో తెలుస్తుందని చెప్పాడు. భారత జట్టు బలంపై కూడా అర్ష్‌దీప్ మాట్లాడాడు. ‘ఈ జట్టులో ప్రతి ఒక్కరూ మ్యాచ్ విన్నర్స్. అందుకే మొదటి నుంచి విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు ఉంది. చివరికి ఆ నమ్మకం నిజమైంది’ అని చెప్పాడు.

Also Read: Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

బౌలింగ్ యూనిట్ పాత్ర గురించి కూడా అర్ష్‌దీప్ సింగ్ మాట్లాడుతూ… ‘బ్యాటర్లు 250 పరుగులు చేస్తే, ప్రత్యర్థి జట్టును 250కు దిగువనే ఆపడం మా బాధ్యతగా భావించాము. అలాగే ముందుగా బౌలింగ్ చేసే పరిస్థితి వస్తే ప్రత్యర్థి స్కోరును వీలైనంత తక్కువగా ఉంచి, మా బ్యాటర్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వడమే లక్ష్యం’ అని చెప్పుకొచ్చాడు. తన ఫోన్ తీసుకుని రీల్స్ చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు. ఇప్పటికే పది నుంచి పదిహేను రీల్స్ గురించి ఆలోచించానని, వాటిలో ఎన్ని చేస్తానో చూద్దామని నవ్వుతూ తెలిపాడు.