Site icon NTV Telugu

Suresh Raina: బాంబ్ పేల్చిన రైనా.. ఐపీఎల్‌కు గుడ్ బై

Suresh Raina Ipl

Suresh Raina Ipl

Suresh Raina Announced Retirement From IPL: క్రికెటర్ సురేశ్ రైనా తాజాగా బాంబ్ పేల్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు గుడ్ బై చెప్పేశాడు. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రైనా వైదొలిగాడు. ఇప్పుడు ఇప్పుడు అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు ట్విటర్ ద్వారా ప్రకటించాడు. విదేశాలకు చెందిన ఫ్రాంచైజీల తరఫున ఆడటం కోసమే రైనా ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ఓవర్సీస్ టీ20 లీగ్‌లో పాల్గొనాలంటే.. బీసీసీఐ నిబంధనల ప్రకారం, ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడతను ఆ పనే చేశాడు.

‘‘ఇన్నేళ్లపాటు ఈ దేశం, నా రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌కు సేవలు అందించినందుకు గర్వంగా భావిస్తున్నా. క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నా. నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన బీసీసీఐ, యూపీసీఏ, చెన్నై టీమ్, రాజీవ్ శుక్లా, నా అభిమానులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా’’ అంటూ రైనా తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. రైనా ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పడం వెనుక మరో కారణం ఉండొచ్చని అందరూ భావిస్తున్నారు. ఐపీఎల్ టాప్ స్కోరర్లలో ఐదో స్థానంలో ఉన్న రైనా.. చెన్నై సూపర్ కింగ్స్‌తో సుదీర్ఘ ప్రయాణం చేశాడు. ఆ జట్టు విజయాల్లో చాలాసార్లు కీలక పాత్ర పోషించాడు. కొన్నిసార్లు ఒంటిచేత్తోనే ఆ జట్టుని నడిపించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి రైనా.. 2022 మెగా వేలంలో అమ్ముడుపోలేదు. చెన్నై అతడ్ని పట్టించుకోలేదు. ఇతర ఫ్రాంచైజీలు సైతం అతనిపై ఆసక్తి కనబరచలేదు. అతడు అన్‌సోల్డ్‌గానే మిగిలిపోయాడు. అది రైనాని నొప్పించింది. బహుశా ఆ కారణం చేతనే అతను ఐపీఎల్‌కు గుడ్ బై చెప్పి ఉండొచ్చని క్రీడాభిమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇకపై దేశవాళీ లీగ్స్‌లో రైనాని చూడలేమని అతని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఓవర్సీస్ లీగ్స్‌లో మనం అతని ఆటని చూడొచ్చు.

మరో రెండు, మూడేళ్లు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నానని రైనా తెలిపాడు. అయితే.. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ దేశవాళీ జట్టులో ఎంతో మంది మంచి ఆటగాళ్లున్నారని, తాను ఇప్పటికే యూపీ క్రికెట్ సంఘం నుంచి ఎన్ఓసీ తీసుకున్నానని చెప్పాడు. తన నిర్ణయం గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా, రాజీవ్ శుక్లాలకు సమాచారం ఇచ్చానన్నాడు. ప్రపంచంలోని వివిధ లీగ్‌ల్లో ఆడాలనుందని, సెప్టెంబర్ 10న ప్రారంభమయ్యే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో ఆడబోతున్నానని స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికా, శ్రీలంక, యూఏఈ దేశాలకు చెందిన ఫ్రాంచైజీలు కూడా తనని సంప్రదించాయని, క్లియరెన్స్ వచ్చాక అందరికీ సమాచారం ఇస్తానన్నాడు. కాగా.. రైనా టీమిండియా తరఫున 266 వన్డేలు, 78 టీ20లు, 18 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 7988 పరుగులు నమోదు చేశాడు.

Exit mobile version