ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో, ముంబైపై 3 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 9 పరుగులకే పెవిలియన్ చేరగా.. అతనితో పాటు క్రీజులో దిగిన ప్రియమ్ గార్గ్ మెరుపులు మెరిపించాడు. 26 బంతుల్లోనే 4 ఫోర్లు 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. రాహుల్ త్రిపాఠి కూడా చెలరేగిపోయాడు. 44 బంతుల్లోనే 9 ఫోర్లు 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు. అతనితోపాటు నికోలస్ పూరన్ (38) కూడా రాణించడంతో, హైదరాబాద్ అంత భారీ స్కోరుని సాధించగలిగింది.
అనంతరం లక్ష్య చేధనకు దిగిన ముంబై జట్టు.. 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు రోహిత్ శర్మ (48), ఇషాన్ కిషన్ (43) లతో పాటు టిమ్ డేవిడ్ (46) కూడా ధాటిగా ఆడటంతో.. ముంబై దాదాపు ఈ మ్యాచ్‌ని గెలిచేస్తుందని అంతా అనుకున్నారు. అయితే.. భువనేశ్వర్ (1/26), ఉమ్రాన్ మాలిక్ (3/23) పొదుపుగా బౌలింగ్ వేయడంతో హైదరాబాద్ విజయం సాధించింది. టి. నటరాజన్ (0/60) భారీగా పరుగులు సమర్పించుకోగా, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీశాడు. ఈ విజయం సాధించినప్పటికీ.. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ స్థానం మారలేదు. ఇప్పటివరకూ 13 మ్యాచులు ఆడిన హైదరాబాద్.. ఆరు విజయాలు, ఏడు ఓటములతో ఎనిమిదో స్థానంలో ఉంది.
