దక్షిణాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్.. భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నిషేధం తర్వాత దక్షిణాఫ్రికా జట్టు తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావడానికి బీసీసీఐ చేసిన సాయం కాన్రాడ్ అమర్చిపోయాడా? అంటూ ఫైర్ అయ్యారు. రెండు దేశాల మధ్య మంచి క్రికెట్ సంబంధాలు ఉన్నాయని, కాన్రాడ్ అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కాన్రాడ్ క్షమాపణ చెప్పాలని తాను డిమాండ్ చేయడం లేదని, తదుపరి విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తారనుకుంటున్నా అని గావస్కర్ తెలిపారు.
25 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికా జట్టు భారత గడ్డపై టెస్ట్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. టీమిండియాను 2-0 తేడాతో టెస్ట్ సిరీస్‌ను వైట్‌వాష్ చేసింది. గౌహతి టెస్ట్ (రెండో టెస్ట్) సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో టీమిండియాను ఉద్దేశించి ప్రోటీస్ కోచ్ షుక్రి కాన్రాడ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రెండో ఇన్నింగ్స్‌ను ఆలస్యంగా ఎందుకు డిక్లేర్ చేశారని అడగ్గా… ‘టీమిండియాను మైదానంలో చాలా సేపు ఉండేలా చేసి, చివరరికి వారిని మా ముందు సాష్టాంగపడేలా చేసేందుకే ఇన్నింగ్స్‌ను లేటుగా డిక్లేర్ చేశాం. భారత ఆటగాళ్లు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాలి కానీ.. ఫలితం మాకు అనుకూలంగా రావాలి. చివరి రోజు చివరి నిమిషం వరకు టీమిండియా ప్లేయర్స్ పోరాడుతూనే ఉండాలి, మేము పైచేయి సాదించాలి’ అని బదులిచ్చాడు.
Also Read: శాంసంగ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. Samsung Galaxy S25 Edgeపై 20 వేల తగ్గింపు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ అదనం!
షుక్రి కాన్రాడ్ చేసిన వ్యాఖ్యలపై రెండు దేశాల క్రికెట్ నిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదివారం జియో హాట్‌స్టార్ షో క్రికెట్ లైవ్‌లో మాట్లాడుతూ సునీల్ గావస్కర్ మాట్లాడుతూ… ‘దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి రావడంలో భారత్, బీసీసీఐ కీలక పాత్ర పోషించాయి. రెండు దేశాల మధ్య లోతైన క్రికెట్ సంబంధాలు ఉన్నందున షుక్రి కాన్రాడ్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. దక్షిణాఫ్రికా అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎలా తిరిగి వచ్చిందో వారు గుర్తుంచుకోవాలి. ఇరవై సంవత్సరాలకు పైగా ఒంటరిగా ఉంది. ఆ సమయంలో దక్షిణాఫ్రికాకు భారత క్రికెట్ బోర్డు ఆఫర్ చేసింది. సఫారీలు మొదటి అంతర్జాతీయ మ్యాచ్ భారతదేశంలో ఆడారు. కాన్రాడ్ క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేయడం లేదు కానీ.. తదుపరి మీడియా సంభాషణలో దీని గురించి మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. నేను వ్యక్తిగతంగా క్షమాపణలను నమ్మను కానీ.. తప్పును సరిదిద్దుకోవడం మంచిది. ఎవరైనా భావోద్వేగంతో మాట్లాడే సందర్భాలు ఉంటాయి. భావోద్వేగంతో అతను అలా మాట్లాడాడని నేను భావిస్తున్నాను’ అని సన్నీ అన్నారు.
