Sunil Gavaskar-BCCI: ఎవడుపడితే వాడు జట్టులోకి వస్తుండు.. బీసీసీఐపై సునీల్ గవాస్కర్ ఫైర్!

  • ప్రతి ఒక్కరికీ సులభంగా భారత జట్టులో చోటు దక్కుతోంది
  • బీసీసీఐపై దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫైర్
  • 'టీమిండియా క్యాప్' వాల్యూ తగ్గుతోంది
Sunil Gavaskar, Bcci

Sunil Gavaskar, Bcci

Sunil Gavaskar Slams BCCI: భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్లకు తరచూ విశ్రాంతి ఇస్తూ ప్రతి సిరీస్‌కు కొత్త కొత్త ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారని, దాంతో ‘టీమిండియా క్యాప్’ వాల్యూ తగ్గిపోతోందని అభిప్రాయపడ్డారు. భారత జట్టులో చోటు సంపాదించడం అనేది గొప్ప గౌరవమని, ఆ అవకాశం ప్రతి ఒక్కరికీ సులభంగా లభించకూడదని సన్నీ పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో భారత జట్టులోకి చాలా మంది అరంగేట్రం చేసిన నేపథ్యంలో గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు క్రికెట్ నిపుణులు అంటున్నారు.

టీమిండియా క్యాప్ విలువ తగ్గుతోంది:

ఇటీవల అఫ్గానిస్థాన్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌ల అనంతరం తన కాలమ్‌లో సునీల్ గవాస్కర్ ఈ అంశంపై స్పందించారు. భారత్ వంటి దేశాలకు అఫ్గానిస్థాన్, జింబాబ్వే, శ్రీలంక వంటి జట్ల అభివృద్ధికి సహకరించే బాధ్యత ఉందని అంగీకరించినప్పటికీ.. అదే సమయంలో భారత ఆటగాళ్ల ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను కూడా దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. ఏడాదిలో కనీసం ఒక నెల పాటు సీనియర్ ఆటగాళ్లకు పూర్తి విశ్రాంతి కల్పించే విధానాన్ని బీసీసీఐ అమలు చేయాలని కోరారు. గవాస్కర్ మాట్లాడుతూ.. ‘భారత్‌లో అపారమైన ప్రతిభ ఉంది. అందువల్ల ఆటగాళ్లను రొటేట్ చేయవచ్చు. కానీ ప్రతి సిరీస్‌కు జట్టును మార్చడం ద్వారా టీమిండియా క్యాప్ విలువ తగ్గుతోంది. ఒక ఆటగాడు జట్టులో చోటు సంపాదించాలంటే తన ప్రతిభతో ఆ అవకాశాన్ని గెలుచుకోవాలి. అంతేకాని విశ్రాంతి తీసుకున్న మరో ఆటగాడి స్థానంలో జట్టులోకి రాకూడదు. భారత జట్టుకు ఆడే అవకాశం సంపాదించాల్సిందే కానీ.. అది అంత సులభంగా దక్కకూడదు’ అని పేర్కొన్నారు.

×
×
Ad

బుమ్రా విశ్రాంతిపై అసంతృప్తి:

అఫ్గానిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ శతకాలు సాధించగా.. యువ స్పిన్నర్ మానవ్ సుతార్ ఆకట్టుకునే అరంగేట్రం చేశాడు. అయితే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడంపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘అఫ్గానిస్థాన్‌పై బుమ్రా కూడా ఆడి ఉంటే తన ఖాతాలో మరో ఐదు లేదా పది వికెట్లు చేరేవి. భారత్ ఆడుతున్నప్పుడు సాధ్యమైనంత వరకు అత్యుత్తమ జట్టే బరిలోకి దిగాలి. గాయాలు ఉంటే తప్ప, వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో తరచూ విశ్రాంతులు ఇవ్వడం తగ్గించాలి’ అని అన్నారు.

ఆటగాళ్లతో పాటు అభిమానులు అలసిపోతున్నారు:

భారత జట్టు ఏడాది పొడవునా ఏదో ఒక సిరీస్ ఆడుతూనే ఉండటాన్ని కూడా సన్నీ ప్రస్తావించారు. ఈ నిరంతర క్రికెట్ షెడ్యూల్ వల్ల ఆటగాళ్లతో పాటు అభిమానులు కూడా అలసిపోతున్నారని చెప్పారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన చివరి రెండు వన్డేలకు లక్నో, చెన్నైలో స్టేడియాలు పూర్తిగా నిండకపోవడం ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. యువ ఆటగాళ్ల అభివృద్ధి కోసం భారత్-ఏ, అండర్-19 జట్లకు ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహించడం మంచిదేనని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. అయితే భారత సీనియర్ జట్టు ఆటగాళ్లకు మాత్రం ఏడాదిలో కనీసం ఒక నెల పూర్తి విశ్రాంతి తప్పనిసరిగా ఇవ్వాలని సూచించారు. 2027 సీజన్‌కు ముందు ఐపీఎల్‌ను త్వరగా ముగించే ఆలోచన ఉన్న నేపథ్యంలో, ఆ అదనపు సమయంలో ఆటగాళ్లు మాత్రమే కాకుండా అభిమానులకు కూడా విరామం కల్పించాలని బీసీసీఐని సన్నీ కోరారు.