Site icon NTV Telugu

Sunil Gavaskar: పంత్ ఓపెనర్‌గా వస్తే.. విధ్వంసమే!

Rishabh Pant

Rishabh Pant

రిషభ్ పంత్ ట్రాక్ రికార్డ్ చూసుకుంటే.. టెస్టుల్లో అదరగొడుతున్నాడు కానీ, పరిమిత ఓవర్లలోనే సరిగ్గా రాణించట్లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో విఫలమైన పంత్.. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో మాత్రం మెరుపులు మెరిపించాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతోనూ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతోనూ చెలరేగిపోయాడు. ఇలా వేర్వేరు ఫార్మాట్లలో భిన్నంగా రాణిస్తున్న పంత్ ఆటపై తాజాగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. టెస్టుల్లో యథావిధిగా పంత్ స్థానాన్ని కొనసాగిస్తూనే.. టీ20ల్లో ఓపెనర్‌గా దింపితే, అతడు విధ్వంసం సృష్టించడం ఖాయమని చెప్పాడు.

‘‘పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పంత్ ఓపెనర్‌గా రావడమే మంచి నిర్ణయమని నేను భావిస్తున్నా. ఎందుకంటే.. ఆస్ట్రేలియా ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ వైట్‌బాల్ క్రికెట్‌లో ఓపెనర్‌గా చెలరేగి ఆడేవాడు. టెస్టుల్లో ఆరు లేదా ఏడో స్థానంలో వచ్చి, మెరుపు ఇన్నింగ్స్‌లతో దుమ్ముదులిపేసేవాడు. ఇప్పుడు రిషభ్ పంత్ అతనిలాగే టెస్టుల్లో రాణిస్తున్నాడు. కాబట్టి, టీ20ల్లో పంత్‌ను ఓపెనర్‌గా పంపితే బెటర్. అతనికి వీలైనన్ని ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం ఉంటుంది. ఫలితంగా.. అతడి నుంచి మనం విధ్వంసకర ఇన్నింగ్స్‌లు చూడగలం’’ అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. మరి, ఈయన అభిప్రాయంతో ఏకీభవించి పంత్‌ను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో ఓపెనర్‌గా పంపుతారా? లేదా? అన్నది వేచి చూడాలి.

కాగా.. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ 111 బంతుల్లో 4 సిక్సులు, 11 ఫోర్ల సహాయంతో 146 పరుగులు చేశాడు. రవీంద్రా జడేజాతో కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. టీ20ని తలపించేలా విధ్వంసం సృష్టించాడు. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్‌లో 86 బంతుల్లో 8 ఫోర్ల సహాయంతో 57 పరుగులు చేశాడు.

Exit mobile version