Sri Lanka’s T20 World Cup Journey: టీ20 ప్రపంచకప్ చరిత్రలో ప్రతిసారి పోటీదారుగా నిలిచిన జట్లలో శ్రీలంక కూడా ఒకటి. ప్రారంభ ఎడిషన్ 2007లోనే సూపర్-8 దశకు చేరి తన సత్తాను చూపించింది. ఆ తర్వాత 2009లో రన్నరప్‌గా నిలిచి.. ప్రపంచ దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించింది. 2010లో సెమీఫైనల్స్ చేరిన లంక.. 2012లో మరోసారి ఫైనల్‌కు చేరి రన్నరప్‌గా నిలిచింది. 2014లో మాత్రం లంక జట్టు తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఆ విజయంతో టీ20 ఫార్మాట్‌లో శ్రీలంక తన స్థాయిని ప్రపంచానికి చాటింది.
అయితే ఆ తర్వాతి టోర్నీల్లో మాత్రం శ్రీలంక జట్టు ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వలేకపోయింది. 2016లో సూపర్-10 దశలోనే ఇంటిదారి పట్టింది. 2021, 2022 ఎడిషన్లలో సూపర్-12 వరకు మాత్రమే లంక ప్రయాణం సాగింది. ఇక 2024లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ప్రస్తుత టీ20 ప్రపంచకప్ 2026 ఎడిషన్‌లో అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ.. మరోసారి సూపర్-8 దశకు అర్హత సాధించింది. ఇటీవలి కాలంలో పెద్దగా విజయాలు లేని లంక జట్టుకు ఇది పెద్ద ఊరటనిచ్చింది.
గత విజయాలను గుర్తు చేస్తూ మరోసారి సెమీస్, ఫైనల్ లక్ష్యంగా ముందుకు సాగాలని శ్రీలంక జట్టు ప్రయత్నిస్తోంది. లంక అభిమానులు కూడా జట్టు నుంచి మరో గొప్ప ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీ20 ప్రపంచకప్ 2026లో శ్రీలంక అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఐర్లాండ్, ఒమన్, ఆస్ట్రేలియాపై లంక విజయాలు సాధించింది. వరుసగా మూడో విజయంతో సూపర్ 8కు దూసుకెళ్లింది. మూడు మ్యాచ్‌లలో లంక బ్యాటర్లు రెచ్చిపోయారు. సూపర్-8లో కూడా ఇదే ప్రదర్శనతో సెమీస్ చేరాలని చూస్తోంది.
