Site icon NTV Telugu

Sri Lanka vs Afghanistan: ఉత్కంఠభరితంగా సాగిన పోరులో లంక విజయం

Sl Vs Afg Super4 Match

Sl Vs Afg Super4 Match

Sri Lanka Won Against Afghanistan In Asia Cup In Super 4 Category: ఆసియా కప్‌లో భాగంగా సూపర్ ఫోర్‌లో చోటు సంపాదించుకున్న శ్రీలంక, ఆప్ఘనిస్తాన్ జట్ల మధ్య నిన్న రాత్రి మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో.. శ్రీలంక విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ కుదిర్చిన 176 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక జట్టు 19.1 ఓవర్లలో ఛేదించింది. ఒకానొక దశలో శ్రీలంక కాస్త తడబడటం, ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు పట్టు సాధించడంతో.. ఆఫ్ఘన్ ఈ మ్యాచ్ కైవసం చేసుకోవచ్చన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. చివర్లో వచ్చిన లంక బ్యాట్స్మన్లు చెలరేగడంతో, నాలుగు వికెట్లు, ఐదు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించగలిగారు.

షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో బ్యాటింగ్ చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్ బ్యాట్స్మన్లు రంగంలోకి దిగారు. ఆరంభం నుంచే ఆఫ్ఘన్ బ్యాట్స్మన్లు దూకుడుగా ఆడారు. ఓపెనర్ హజ్రతుల్లా జజై (13) వెంటనే పెవిలియన్ చేరినా.. అతనితో పాటు క్రీజులో దిగిన రహ్మానుల్లా గుర్బాజ్ మాత్రం లంక బౌలర్లపై తాండవం చేశాడు. కేవలం 45 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 84 పరుగులు చేశాడు. వన్ డౌన్‌లో వచ్చిన ఇబ్రహీం జద్రాన్ (38 బంతుల్లో 40) అతనికి తోడు ఇవ్వడంతో.. ఇద్దరు కలిసి రెండో వికెట్‌కి 93 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే.. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మన్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. ఫలితంగా.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఆఫ్ఘనిస్తాన్ 175 పరుగులు చేసింది. తొలుత ఆఫ్ఘన్ బ్యాట్స్మన్లు చూపించిన దూకుడు చూసి, 200 పరుగుల మార్క్‌ని దాటిస్తారని అనుకున్నారు కానీ, అది సాధ్య పడలేదు.

ఇక 176 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన శ్రీలంక బ్యాట్స్మన్లు సైతం మొదట్నుంచే తమ బ్యాటుకి పని చెప్పడం మొదలుపెట్టారు. ఓపెనర్ నిస్సాంకా (28 బంతుల్లో 35) ఆచితూచి రాణిస్తే, అతనితో పాటు క్రీజులోకి వచ్చిన కుశల్ మెండిస్ మాత్రం మెరుపులు మెరిపించాడు. 19 బంతుల్లోనే 2 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 36 పరుగులు చేశారు. అయితే.. వీళ్లిద్దరు ఔటయ్యాక మ్యాచ్ ఆఫ్ఘన్ వైపు టర్న్ తీసుకుంది. ధనుష్క గుణతిలక (20 బంతుల్లో 33) దుమ్మురేపినా.. అతని కంటే ముందు, అతని తర్వాత వచ్చిన చరిత్ అసలంక (14 బంతుల్లో 8), దాసున శనక (9 బంతుల్లో 10) నిరాశపరిచారు. ఈ దెబ్బకు మ్యాచ్ ఆఫ్ఘన్‌దేనని అనుకున్నారు. కానీ.. ధనుష్క రాజపక్స తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మలుపు తిప్పేశాడు. 14 బంతుల్లోనే 31 పరుగులు చేయడంతో, లంక లక్ష్యానికి చేరువైంది. అతని తదనంతరం వచ్చిన వనిందు (9 బంతుల్లో 16), చమిక (2 బంతుల్లో 5) రాణించడంతో.. శ్రీలంక లక్ష్యాన్ని చేధించగలిగింది.

Exit mobile version