Asia Cup 2022: ఉత్కంఠభరితంగా సాగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ శ్రీలంక జట్టు ఘనవిజయం సాధించింది. పాకిస్తాన్‌పై 23 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. దీంతో 15వ ఎడిషన్ ఆసియా కప్ విజేతగా శ్రీలంక అవతరించింది. టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. శ్రీలంక బ్యాటింగ్‌తో బరిలోకి దిగింది. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్ భానుకా రాజపక్స 45 బంతుల్లో 71 పరుగులు శ్రీలంకను ఆదుకున్నాడు. రాజపక్స కీలక ఇన్నింగ్స్‌తో ద్వీపదేశం జట్టు ఆ పరుగులను సాధించగలిగింది. పాక్ బౌలర్ల ధాటికి మొదట 58 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన లంకను భానుక రాజపక్స (71*), హసరంగ (36) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. ఆపై హసరంగ అవుటైనప్పటికీ.. కరుణరత్నే (14*) తోడుగా రాజపక్స చెలరేగడంతో ఆ జట్టు అమూల్యమైన పరుగులు సాధించింది. చివరి 10 ఓవర్లలో లంక 103 పరుగులు రాబట్టడం విశేషం. పాక్ బౌలర్లలో హారిస్ రౌఫ్ 3 వికెట్లు పడగొట్టాడు. నసీమ్ షా, షాదాబ్ ఖాన్, ఇఫ్టికార్ అహ్మద్‌కు తలో వికెట్ దక్కింది.
శ్రీలంక నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యఛేదనలో పాక్ విఫలమైంది. 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. మహ్మద్ రిజ్వాన్(55 పరుగులు), ఇఫ్తికర్ అహ్మద్(32 పరుగులు) క్రీజులో ఉన్నంత వరకు లక్ష్యం దిశగానే సాగింది. అయితే లంక బౌలర్ ప్రమోద్ మదుషన్ నాలుగు వికెట్లతో పాక్ పతనాన్ని శాసించగా.. స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగా కీలక సమయంలో మూడు వికెట్లతో మెరిశాడు. మహమ్మద్ రిజ్వాన్ పోరాడినా ఫలితం లేకపోయింది. అతనికి తోడుగా పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్ నిలబడకపోవడంతో పాక్ చతికిలపడింది. పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ 49 బంతుల్లో 55 పరుగులు చేయగా.. ఇఫ్టికార్ అహ్మద్ 31 బంతుల్లో 32 పరుగులతో పాక్‌ను గెలిపించడానికి పోరాడారు.
Bigg boss 6: కెప్టెనే… స్టార్ ఆఫ్ ది వీక్!
కాగా ద్వీపదేశం శ్రీలంక ఆసియా కప్‌ను సొంతం చేసుకోవడం ఇది ఆరోసారి. తాజాగా దాసున్ షనక కెప్టెన్సీలో లంక టైటిల్ నెగ్గగా.. చివరగా 2014లో ఏంజల్లో మాథ్యూస్ నేతృత్వంలోని లంక జట్టు వన్డే ఫార్మాట్‌లో జరిగిన అప్పటి ఆసియా కప్‌లోనూ పాక్‌ను ఫైనల్లో ఓడించి విజేతగా నిలిచింది.