Sports and Technology: ఆటల్లో చాలా మంది అతి తెలివిని ప్రదర్శిస్తుంటారు. అసలు వయసును దాచి జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ‘అండర్’ కేటగిరీలో బరిలోకి దిగుతుంటారు. ఏజ్‌కి సంబంధించిన దొంగ సర్టిఫికెట్లు పెడుతుంటారు. తద్వారా ఎన్నో అడ్వాంటేజ్‌లను పొందుతున్నారు. స్కూళ్లలో, కాలేజీల్లో సీట్లు, చివరికి ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాలు కూడా కొట్టేస్తుంటారు. అయితే.. అలాంటివాళ్ల ఆటలు ఇక సాగవు. ఎందుకంటే మోడ్రన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అది ఆటగాళ్ల నిజమైన వయసును సరిగ్గా నిర్ధారిస్తోంది. దీంతో దొంగలకు చెక్ పడుతోంది. ఏజ్ ఫ్రాండ్స్‌కి క్రమంగా బ్రేక్ వేస్తోంది.
ఎవరైనా ప్లేయర్లు అసలు వయసును దాచినట్లు ఈవెంట్ నిర్వాహకులకు అనుమానం వస్తే వెంటనే మెడికల్ టీమ్‌లను రంగంలోకి దించుతున్నారు. ఆటగాళ్ల దంతాలను లేదా ఎముకల పరిమాణాన్ని పరిశీలించి వాస్తవ వయసును తెలుసుకుంటున్నారు. ఎక్స్‌రే చేయటం ద్వారా కూడా కచ్చితమైన వయసును కనుక్కొంటున్నారు. ఒరిజినల్ ఏజ్‌ని గుర్తించేందుకు బర్త్ సర్టిఫికెట్లను, ఆధార్ కార్డులను పరశీలిస్తున్నప్పటికీ కొంత మంది ప్లేయర్లు వాటిని మ్యానిపులేట్ చేసి ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) రిటైర్డ్ కోచ్ ఒకరు చెప్పారు.
read also: AndhraPradesh Woman: మానవ సేవే “మాధవి” సేవ. అంతిమ ‘సంస్కారం’ చూపుతున్న ఆంధ్రప్రదేశ్ మహిళ
“సీనియర్ ప్లేయర్లు స్కూళ్లు, కాలేజీలు, మునిసిపల్ ఆఫీసుల నుంచి నకిలీ వయసు ధ్రువీకరణ పత్రాలను తెచ్చుకోవటం ద్వారా జూనియర్ కేటగిరీలో ఆడుతూ వివిధ రకాలుగా ప్రయోజనం పొందుతారు. అదే సమయంలో అర్హులైన జూనియర్లకు అన్యాయం చేస్తున్నారు” అని తెలిపారు. ఇండియన్ బాక్సింగ్ కోచ్, బాస్కెట్ బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా టెక్నికల్ కమిషన్ చైర్మన్ తదితరులు కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “అండర్-16 ఏజ్ ప్లేయర్లు యూత్ కేటగిరీలో, అండర్-18 ఏజ్ ప్లేయర్లు జూనియర్ లెవల్ కేటగిరీలో ఆడేందుకు అర్హులు. అందుకే ముఖ్యంగా ఈ రెండు కేటగిరీల్లోనే ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి.
పార్టిసిపెంట్లు ప్రైమరీ బర్త్ సర్టిఫికెట్లను చూపించట్లేదు. పుట్టిన ఐదేళ్ల తర్వాతో, పదేళ్ల తర్వాతో తీసుకున్న వయసు ధ్రువీకరణ పత్రాలను ఇస్తున్నారు. దీనివల్ల ఎక్కువ వయసు ఉన్నప్పటికీ తక్కువ వయసును క్లెయిమ్ చేసుకుంటున్నారు. అందుకే మేం ఇప్పుడు ఒక నిర్ణయాన్ని అమలుచేస్తున్నాం. పుట్టిన ఐదేళ్ల లోపు తీసుకున్న బర్త్ సర్టిఫికెట్లనే పరిగణనలోకి తీసుకుంటున్నాం” అని పేర్కొన్నారు. ఇలాంటి మరిన్ని సంస్కరణలు వస్తే తప్ప క్రీడా రంగంలో ఏజ్ ఫ్రాడ్స్‌కి పూర్తిగా అడ్డుకట్ట పడదని అంటున్నారు. పాలకులు, అధికారులు ఈ దిశగా కఠినమైన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
