Site icon NTV Telugu

Sunrisers Hyderabad: అసిస్టెంట్ కోచ్ పదవికి సైమన్ కటిచ్ రాజీనామా

మరికొద్ది రోజుల్లో ఐపీఎల్ 15 ప్రారంభం కానుంది. అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. అసిస్టెంట్ కోచ్ పదవికి సైమన్ కటిచ్ రాజీనామా చేశారు. ఇటీవల ఐపీఎల్ ఆటగాళ్ల కోసం జరిగిన మెగా వేలం పాటలో ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహాలు నచ్చకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. యాజమాన్యంతో విభేదాలు వచ్చినందుకే సైమన్ కటిచ్ జట్టును వీడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన ‘ది ఆస్ట్రేలియన్’ కూడా ఓ కథనాన్ని ప్రచురించింది.

కాగా గత ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు కేవలం మూడు మ్యాచ్‌లలో మాత్రమే గెలిచింది. అంతేకాకుండా పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ను తొలగించడం, తుది జట్టులో కూడా ఆడిపించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కొత్త సీజన్‌ ఆరంభానికి ముందు కొత్త సిబ్బందిని నియమించింది. వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారాను బ్యాటింగ్‌ కోచ్‌గా నియమించింది. సైమన్‌ కటిచ్‌ను అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంచుకుంది. హెడ్‌ కోచ్‌గా టామ్‌ మూడీ, ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా డేల్‌ స్టెయిన్‌, స్పిన్‌ బౌలింగ్‌ కోచ్‌గా ముత్తయ్య మురళీధరన్‌, ఫీల్డింగ్‌ కోచ్‌గా హేమంగ్‌ బదానీని నియమించింది.

Exit mobile version