Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!

  • భారత టీ20 జట్టు కొత్త కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
  • నాయకత్వ శైలిపై స్పందించిన సర్పంచ్ సాబ్
  • ఎవరి కోసం నేను మారను అంటున్న శ్రేయాస్
Shreyas Iyer Captain

Shreyas Iyer Captain

Shreyas Iyer on India T20 Captaincy: భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రేయస్ అయ్యర్ తన నాయకత్వ శైలిపై స్పష్టమైన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. కెప్టెన్సీ బాధ్యతలు పెద్ద సవాలేనని అంగీకరించిన సర్పంచ్ సాబ్.. తన వ్యక్తిత్వాన్ని మాత్రం మార్చుకోనని స్పష్టం చేశాడు. ఎవరి నీడలోనూ ఉండకుండా, తనదైన శైలిలో జట్టును నడిపించాలని భావిస్తున్నట్లు శ్రేయస్ వెల్లడించాడు. తాజాగా సూర్యకుమార్ స్థానంలో శ్రేయస్‌ను టీమిండియా టీ20 సారథిగా బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే.

కెప్టెన్సీ పెద్ద సవాలు.. కానీ:
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన శ్రేయస్ అయ్యర్.. భారత జట్టు కెప్టెన్‌గా ఎంపిక కావడం తనకు గొప్ప గౌరవమని పేర్కొన్నాడు. ‘నాకు టీమిండియా టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించారు. ఇది ఒక గొప్ప సవాలు. అయితే ఈ బాధ్యతల కోసం నా వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. మరొకరిలా మారడానికి లేదా ఎవరి నీడలో ఉండడానికి ప్రయత్నించను. నా శైలిలో ముందుకు వెళుతా’ అని స్పష్టం చేశాడు.

×
×
Ad

నిరూపించుకున్న తర్వాతే అవకాశం:
శ్రేయస్ అయ్యర్‌ 2023 డిసెంబర్‌లో చివరిసారిగా భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జట్టులో స్థానం దక్కలేదు. 2025 టీ20 ప్రపంచ కప్‌తో పాటు ఆసియా కప్‌లో కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఆ సమయంలో సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే ఐపీఎల్‌లో వరుసగా అద్భుత ప్రదర్శనలు చేస్తూ.. శ్రేయస్ నిరూపించుకున్నాడు. 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన అయ్యర్.. అనంతరం పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా జట్టును 2025 సీజన్ ఫైనల్‌కు చేర్చాడు. నాయకత్వం, నిలకడైన బ్యాటింగ్ ప్రదర్శనలతో బీసీసీఐ సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. దాంతో ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల కోసం భారత టీ20 జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

గంభీర్‌తో మరోసారి జోడీ:
శ్రేయస్ అయ్యర్ కెరీర్‌లో అత్యంత విజయవంతమైన ఘట్టాల్లో ఒకటి 2024 ఐపీఎల్ టైటిల్. అయితే ఆ విజయానికి అతడికి రావాల్సిన గుర్తింపు రాలేదనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. జట్టు మెంటర్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌ను ఆ విజయానికి ప్రధాన కారణంగా పలువురు కొనియాడగా.. కెప్టెన్‌గా అయ్యర్ పాత్ర మరుగునపడింది. ఇప్పుడు భారత టీ20 జట్టులో గంభీర్ కోచ్‌గా, శ్రేయస్ కెప్టెన్‌గా కలిసి పనిచేయబోతున్నారు. ఈ జోడీ భారత జట్టు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

భారీ అంచనాల మధ్య కొత్త ప్రయాణం:
టీ20 ప్రపంచ కప్ 2028ను దృష్టిలో పెట్టుకుని భారత జట్టు కొత్త నాయకత్వ వ్యవస్థను రూపొందిస్తున్న నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒత్తిడిని తట్టుకుని జట్టును ముందుండి నడిపించే సామర్థ్యం అతడికి ఉందని మాజీ క్రికెటర్లు విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయాలని చూస్తున్న అయ్యర్.. ‘నా స్టైల్ నాదే’ అనే సందేశంతో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు.