Shreyas Iyer on India’s Loss vs NZ: న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆదివారం హామిల్టన్‌లోని సెడ్డాన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేయగా.. కివీస్ 18 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శనపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. బౌలింగ్, ఫీల్డింగ్ ప్రదర్శనపై అసంతృప్తి వ్యక్తం చేసిన సర్పంచ్ సాబ్.. తప్పులు కూడా చేశాం అని ఒప్పుకున్నాడు. బౌలింగ్, ఫీల్డింగ్‌లో టీమిండియా ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
బ్యాటింగ్‌లో మరింత మెరుగుపడాల్సింది:
‘భారత జట్టు 194 పరుగులు చేసినా.. బ్యాటింగ్‌లో మరింత మెరుగ్గా ఆడాల్సింది ఇషాన్ కిషన్‌తో కలిసి నేను మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు ఊపునిచ్చాము. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒత్తిడి పెరిగింది. కొత్తగా క్రీజులోకి వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి పెరిగింది. వికెట్‌పై బంతి సీమ్ అవుతూ, కొన్నిసార్లు బ్యాట్‌పైకి వేగంగా రావడం, మరికొన్ని సందర్భాల్లో ఆగి రావడం కనిపించింది. నేను, తిలక్ వర్మ కూడా దాదాపు ఒకే తరహాలో ఔటయ్యాం. అయినప్పటికీ 194 పరుగుల స్కోరు సాధించడం మంచి స్కోర్ అనే భావిస్తున్నా’ అని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు.
బౌలింగ్, ఫీల్డింగ్ చెత్తగా ఉంది:
భారత బౌలింగ్, ఫీల్డింగ్ ప్రదర్శనపై శ్రేయస్ అయ్యర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘మా బౌలింగ్, ఫీల్డింగ్ ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టాలి. కొన్ని విషయాలపై చర్చించి, వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. విదేశాల్లో ఆడేటప్పుడు విభిన్న పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే ఆట మరింత మెరుగవుతుంది. మొదటి మూడు మ్యాచ్‌లు మాకు మంచి రిథమ్‌ను ఇచ్చాయి. చివరి రెండు మ్యాచ్‌ల్లో ప్రయోగాలు చేయాలని, మమ్మల్ని మేము మరింత సవాలు చేసుకోవాలని అనుకున్నాం. ఈ మ్యాచ్ అందుకు సరైన అవకాశం. కానీ మేము అనుకున్నట్లు ఆడలేకపోయాం. అయినప్పటికీ ఇది మాకు నేర్చుకునే అవకాశంను ఇచ్చింది’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
భారత అభిమానులు అద్భుతం:
న్యూజిలాండ్ పర్యటనలో భారత అభిమానులు అందించిన మద్దతుపై శ్రేయస్ అయ్యర్ కృతజ్ఞతలు తెలిపాడు. మ్యాచ్‌లకు పెద్ద సంఖ్యలో హాజరై జట్టును ప్రోత్సహించడం ఆటగాళ్లకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని చెప్పాడు. అభిమానుల ప్రేమ, మద్దతు ప్రతి మ్యాచ్‌లోనూ కొనసాగాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం టీ20 ప్రదర్శనపై ఎక్కువగా ఆలోచించకుండా వన్డే సిరీస్‌పై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్లు శ్రేయస్ తెలిపాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఎదురైన విభిన్న పరిస్థితులు జట్టుకు మంచి అనుభవాన్ని అందించాయని, ఈ ఓటమి నుంచి నేర్చుకుని తదుపరి మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాలని టీమిండియా భావిస్తోంది.

