Shreyas Iyer: 7 మ్యాచ్‌ల నిరీక్షణకు తెర.. రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్‌కు విముక్తి!

  • తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం
  • శ్రేయస్ అయ్యర్‌కు వ్యక్తిగతంగా కూడా కలిసొచ్చిన తొలి టీ20
  • రెండు చెత్త రికార్డుల నుంచి శ్రేయస్‌కు విముక్తి
Shreyas Iyer Unwanted Record

Shreyas Iyer Unwanted Record

Shreyas Iyer Breaks Unwanted T20I Captaincy Records: జింబాబ్వే పర్యటనను టీమిండియా ఘన విజయంతో ప్రారంభించింది. గురువారం హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ విజయం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు వ్యక్తిగతంగా కూడా కలిసొచ్చింది. సర్పంచ్ సాబ్ కెప్టెన్సీ చేపట్టాక వరుస పరాజయాలు వెంటాడగా.. ఈ విజయం అతడికి భారీ ఊరటను ఇచ్చింది.

టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శ్రేయస్ అయ్యర్‌ తొలి ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా అందుకోలేదు. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో భారత్ 2-0తో ఓడిపోగా.. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో 4-0తో పరాజయం పాలైంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మొత్తం ఏడు మ్యాచ్‌ల్లో ఆరు ఓటములు, ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగియడంతో.. భారత జట్టు టీ20 చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ విజయరహిత పరంపరను నమోదు చేసింది. అయితే జింబాబ్వేపై విజయం సాధించడం ద్వారా ఆ చెత్త రికార్డుకు బ్రేక్ పడింది.

అంతేకాదు శ్రేయస్ అయ్యర్ మరో చెత్త రికార్డు నుంచి కూడా విముక్తి పొందాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుసగా ఏడు టాస్‌లు గెలిచి కూడా.. ఒక్క మ్యాచ్ గెలవని కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్ నిలిచాడు. ఈ చెత్త రికార్డు జాబితాలో బల్గేరియా మాజీ కెప్టెన్ ప్రకాశ్ మిశ్రా (ఏడు మ్యాచ్‌) తో కలిసి శ్రేయస్ సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు జింబాబ్వేపై విజయం సాధించడంతో ఆ అపజయ పరంపరకు కూడా బ్రేక్ పడింది. అర్జెంటీనాకు చెందిన హెర్నాన్ ఫెన్నెల్ ఆరు మ్యాచ్‌లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలర్లు జింబాబ్వేను 125/7కే పరిమితం చేశారు. అనంతరం 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 18 బంతుల్లోనే అర్ధశతకం బాదడంతో భారత్ లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో టీమిండియా కొత్త ఆరంభం చేసింది. వరుస పరాజయాల తర్వాత వచ్చిన ఈ విజయం జట్టుకు మాత్రమే కాకుండా కెప్టెన్‌గా అయ్యర్‌కు కూడా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని అందించింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ అదే జోరును కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తోంది.