టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా పరిస్థితి అయోమయంగా మారింది. భారత్ సెమీఫైనల్ చేరాలంటే న్యూజిలాండ్ జట్టు పసికూనల చేతిలో ఓ మ్యాచ్‌లో ఓడిపోవాలని టీమిండియా అభిమానులు కోరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాత్రం టీమిండియా ఫైనల్‌కు రావాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఎందుకంటే అక్కడ మరోసారి భారత్‌ను ఓడించాలని భావిస్తున్నామని, దాని కోసం తమకు మరో మౌకా (అవకాశం) ఇవ్వాలని ఆకాంక్షించాడు. ఇప్పుడు ‘మౌకా’ అనే పదం ఎంతమాత్రం తమ జట్టును అపహాస్యం చేయదని అక్తర్ అంటున్నాడు.
Read Also: భారత పర్యటనకు రానున్న న్యూజిలాండ్ టీమ్స్ ఇవే..!!
సరదాగా ప్రకటనలు రూపొందించడం తప్పు కాదు.. కానీ అవి ఓ దేశాన్ని కించపరచేలా ఉండకూడదని అక్తర్ అభిప్రాయపడ్డాడు. తమది ప్రపంచం గర్వించే దేశమన్నాడు. మరోవైపు భారత్-అఫ్ఘనిస్తాన్ మ్యాచ్ ఫిక్స్ అయిందంటూ పాకిస్థాన్ అభిమానులు పోస్టులు పెట్టడం సరికాదని అక్తర్ సూచించాడు. అసలే అప్ఘనిస్తాన్ దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో ఫిక్సింగ్ వ్యాఖ్యల వల్ల ఆ జట్టు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని అక్తర్ అన్నాడు.
