Shoaib Akhtar Sensational Comments On Pakistan T20 WorldCup Team: పాకిస్తాన్ జట్టు చేస్తోన్న తప్పులేంటి? ఏయే ప్లేయర్లు ఉండాలి? ఎవరెవరిని తీసేయాలి? ఎలాంటి ఆటతీరుని కనబర్చాలి? అంటూ తన సలహాలు ఇచ్చే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్‌కు ఎంపిక చేసిన జట్టు మీద, సెలెక్షన్ టీమ్ మీద తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఇటీవల ఆసియా కప్‌కు ఎంపిక చేసిన జట్టుకి, వరల్డ్‌కప్ జట్టుకి పెద్ద తేడా లేదని చెప్పిన షోయబ్.. మిడిలార్డర్ డెప్ట్ లేదని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం పాక్ మిడిలార్డర్ చూస్తుంటే.. ఈ జట్టు సెమీ ఫైనల్స్‌కి వెళ్లడం కాదు కదా, ఫస్ట్ రౌండ్‌లోనే వెనక్కు తిరిగి వచ్చేలా కనిపిస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశాడు. పాక్ క్రికెట్ జట్టుకి కష్ట కాలం రాబోతోందని, ఈ జట్టు కంటే మెరుగైన జట్టుని ఎంపిక చేసి ఉంటే బాగుండేదని అన్నాడు. ఆసియా కప్‌లో పాక్ జట్టు ఎంత దారుణంగా విఫలమైందో అందరూ చూశారని, అది చూసి కూడా మళ్లీ దాదాపు ఆ జట్టునే ఎంపిక చేయడం ఏంటని అతడు ప్రశ్నించాడు. జట్టుని ఎలా ఎంపిక చేయాలన్న విషయం మీద సెలెక్షన్ టీమ్‌కి కనీస అవగాహన కూడా లేనట్టుందని అతడు పెదవి విరిచాడు. కాగా.. టీ20 వరల్డ్‌కప్ అక్టోబర్ 16వ తేదీ నుంచి జరగనుంది. అక్టోబర్ 23వ తేదీన భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగనుంది.
టీ20 వరల్డ్‌కప్ పాక్ టీమ్:
బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, హైదర్ అలీ, హారిస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఖుష్ దిల్ షా, మొహమ్మద్ హస్నైన్, మొహమ్మద్ నవాజ్, మొహమ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీమ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిదీ, షాన్ మసూద్, ఉస్మాన్ ఖాదిర్.
రిజర్వ్ బెంచ్: ఫక్తర్ జమాన్, మొహమ్మద్ హారిస్, షానవాజ్ దహానీ.
