NTV Telugu Site icon

Shoaib Akhtar: కోహ్లీ, రోహిత్ మళ్లీ విఫలమైతే ఇదే చివరి T20 ప్రపంచకప్..

88310189

88310189

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్, భారత దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. టీ20 ప్రపంచకప్‌లో ఈ ఇద్దరు చెలరేగాలని, లేకుంటే వారికి ఇదే చివరి మెగా టోర్నీ అవుతుందని హెచ్చరించారు. ఇక మెగా టోర్నీ నేపథ్యంలో విరాట్‌ కోహ్లీ, రోహిత్ శర్మ మరింత ఒత్తిడిలో కూరుకుపోయే అవకాశం ఉందని అక్తర్ అభిప్రాయపడ్డాడు. సచిన్ టెండూల్కర్ సైతం 100వ సెంచరీ నేపథ్యంలో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని గుర్తు చేశాడు.
ఓ చానెల్‌లో విరాట్, రోహిత్ పేలవ ఫామ్‌పై చర్చించి భజ్జీ, అక్తర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా అక్తర్‌ మాట్లాడుతూ.. ‘విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మకు ఇదే రకమైన ఆట కొనసాగిస్తే.. వారికి ఇదే చివరి ఐపీఎల్‌, చివరి వరల్డ్‌కప్‌ అని అనుకుంటే.. ఫామ్‌లేమి కారణంగా వారు మరింత ఒత్తిడిలోకి కూరుకుపోతారు. కెరీర్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇందుకు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కరే ఉదహారణ. సచిన్‌ను సైతం 100వ సెంచరీ గురించి పదే పదే ప్రశ్నించడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. 99 సెంచరీలు చేసిన సచిన్ 100వదానికి చాలా టైమ్ తీసుకున్నాడు.’ అని అక్తర్ తెలిపాడు.

ఇక హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. అక్తర్ వ్యాఖ్యలతో ఏకీభవించాడు.’కోహ్లీ, రోహిత్ శర్మలకు ఈ IPL సీజన్‌ అంత గొప్పగా ఏమీ సాగలేదు. నిజానికి వాళ్లిద్దరికీ టీ20 వరల్డ్‌కప్‌ కీలకం. వారు కూడా ఈ ప్రపంచకప్ గెలుస్తామనే ఆశావాదంతో ఉన్నారు. నవతరం ఆటగాళ్లు దూసుకువస్తున్న వేళ ఈ ఇద్దరు రాణించడం కీలకం. లేకుంటే వారికి ఇదే చివరి టీ20 ప్రపంచకప్ కావచ్చు.’అని హర్భజన్ సింగ్ హెచ్చరించాడు.

రోహిత్ శర్మ సారథ్యంలో సొంతగడ్డపై వరుస T20 సిరీస్‌లు గెలిచిన టీమిండియా ఈ ఏడాది పొట్టి ఫార్మాట్‌ ప్రపంచకప్‌నకు సిద్ధమవుతోంది. అయితే, IPL 2022 సీజన్‌లో కోహ్లీ, రోహిత్‌ దారుణంగా విఫలమయ్యారు. విరాట్‌ 16 మ్యాచ్‌ల్లో 22.73 సగటుతో 341 పరుగులే చేయగా.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కేవలం 268 పరుగులు మాత్రమే చేసి విమర్శలపాలయ్యాడు. ఎన్నడూ లేని విధంగా ముంబై జట్టు సైతం ఘోరంగా విఫలమైంది. ఇక ఆఖరి స్థానంతో IPL 2022 సీజన్‌ను ముగించింది.