Site icon NTV Telugu

Shikhar Dhawan: విదేశాల్లో విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లు.. వందల కోట్లకు యజమాని గబ్బర్!

Shikhar Dhawan Birthday

Shikhar Dhawan Birthday

‘శిఖర్ ధావన్’.. సగటు క్రికెట్ అభిమానికి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓపెనర్‌గా ఆడిన గబ్బర్.. టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు. విదేశీ గడ్డపై కూడా సత్తా చాటాడు. మైదానంలో తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అనేక రికార్డులను బద్దలు కొట్టిన ధావన్.. అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ఆట నుంచి రిటైర్ అయినా తన వ్యక్తిగత జీవితంతో నిత్యం వార్తల్లోనే ఉంటున్నాడు. తన కొత్త స్నేహితురాలు సోఫీ షైన్‌తో దిగిన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. ఈరోజు 40వ పుట్టినరోజు జరుపుకుంటున్న గబ్బర్‌కు విదేశాల్లో విలాసవంతమైన ఇళ్లు, లగ్జరీ కార్లు ఉన్నాయి.

విధ్వంసక బ్యాటింగ్‌తో అంతర్జాతీయ బౌలర్లను భయపెట్టిన భారత ఓపెనర్లలో శిఖర్ ధావన్ ఒకడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తూ చాలా పరుగులు చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ధావన్ రాణించాడు. ఆ టోర్నమెంట్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాడు. 2015 వన్డే ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పరుగులు చేశాడు. ఈ రెండు టోర్నమెంట్లలో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు గబ్బర్. ఐపీఎల్‌లో ధావన్ ప్రదర్శన అద్భుతంగా ఉంది.

2013లో ఆస్ట్రేలియాపై కేవలం 85 బంతుల్లోనే శిఖర్ ధావన్ సెంచరీ సాధించాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా రెండుసార్లు గోల్డెన్ బ్యాట్ గెలుచుకున్న ప్రపంచంలోనే ఏకైక బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లో నిలిచాడు. 40 ఏళ్ల ధావన్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడి 10,867 పరుగులు సాధించాడు. ఆటకు వీడ్కోలు చెప్పిన గబ్బర్ ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ధావన్ వద్ద రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్-బెంజ్ GLS, BMW M8, రేంజ్ రోవర్ వెలార్, ఆడి A6 ఉన్నాయి. ఢిల్లీ, ముంబైలలో ఆస్తులు ఉన్నాయి. గురుగ్రామ్‌లో ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ ఉంది. దాని విలువ రూ.69 కోట్లు అని తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో కూడా ఒక విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేశాడు. 2015లో దాదాపు 730,000 డాలర్లకు కొనుగోలు చేశాడు. దీని విలువను భారత కరెన్సీలో దాదాపు 7 కోట్ల రూపాయలు. 2024-25 నాటికి ధావన్ నికర విలువ దాదాపు రూ.145-155 కోట్లు ఉంటుందని నివేదికల అంచనా.

Also Read: Viral Video: 200MP కెమెరా, 10 ఇంచెస్ మెయిన్ స్క్రీన్‌.. ఈ శాంసంగ్‌ ఫోన్‌ను టాబ్లెట్‌గా కూడా వాడుకోవచ్చు!

శిఖర్ ధావన్ తాను ఆడే రోజుల్లో బీసీసీఐ గ్రేడ్ A వార్షిక కాంట్రాక్టులో ఉన్నాడు. అందుకు గాను రూ.5 కోట్లు అందుకున్నాడు. ఐపీఎల్‌లో కోట్ల రూపాయలు కూడా సంపాదించాడు. ఇప్పుడు వివిధ బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, యాడ్స్ ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల నుంచి 10-12 కోట్ల వార్షిక ఆదాయాన్ని ఆర్జిస్తాడు. వెంచర్ క్యాపిటల్ సంస్థకు గబ్బర్ స్థాపకుడు కూడా. ఇక ధావన్ 2023లో ఆయేషా ముఖర్జీకి విడాకులు ఇచ్చాడు. అతనికి జోరావర్ అనే కుమారుడు ఉన్నాడు. ధావన్ ఇప్పుడు ఐరిష్ పౌరురాలు సోఫీ షైన్‌తో డేటింగ్ చేస్తున్నాడు.

Exit mobile version