టీమిండియాకు ఫాస్ట్ బౌలర్ షమీ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో బుమ్రాతో కలిసి జట్టుకు విజయాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాడు. అయితే వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని విభేదాల కారణంగా షమీ తన భార్య హసీన్ జహాన్‌తో దూరంగా ఉంటున్నాడు. తాజాగా షమీ భార్య హసీన్ జహాన్ ప్రధాని మోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఓ ముఖ్యమైన విజ్ఞప్తిని చేసింది. కంగారు పడకండి… ఆమె ఇందులో షమీపై ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. కానీ తన విజ్ఞప్తి ద్వారా హసీన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండియా పేరు మార్చాలని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కోరింది. దీంతో ప్రస్తుతం హసీన్ జహాన్ విజ్ఞప్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
షమీ భార్య హసీన్ జహాన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా భారత్‌లో పుట్టడం తనకు గర్వకారణంగా ఉందని.. తాను తన దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని తెలిపింది. ఈ మేరకు ఐలవ్ భారత్ అంటూ రాసుకొచ్చింది. మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్‌గా కానీ, హిందుస్థాన్‌గా కానీ మార్చాలని మోదీ, అమిత్ షాలను ఆమె విజ్ఞప్తి చేసింది. మన దేశం మనకు గర్వకారణమని ఆమె అభిప్రాయపడింది. ఇండియా పేరుతో దేశానికి దక్కాల్సిన గుర్తింపు దక్కలేదని.. పేరు మారిస్తే మనకు దక్కాల్సిన గుర్తింపు దక్కుతుందని వివరించింది. దేశమంతటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వజ్రోత్సవాలు జరుగుతున్న వేళ ఇండియా పేరు మార్చాలని షమీ భార్య కోరడం సర్వత్రా ఆసక్తిని రేపుతోంది. కాగా మహ్మద్ షమీ, హసీన్ జహాన్ 2014 లో వివాహం చేసుకున్నారు. అయితే ఇద్దరి మధ్య వివాదం చెలరేగడంతో 2018 నుంచి విడివిడిగా నివసిస్తున్నారు.
