NTV Telugu Site icon

Sehwag: గెలవాల్సిన మ్యాచ్‌ను వాళ్లు ముంబైకి అప్పచెప్పారు

Sehwag

Sehwag

ఐపీఎల్‌లో శుక్రవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టు 5 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. అయితే ఓపెనర్లు శుభారంభం అందించినా.. ఓపెనర్లు ఇద్దరూ హాఫ్ సెంచరీలు చేసినా ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓడిపోవడంపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఆటగాళ్ల నిర్లక్ష్యమే ఈ ఓటమికి కారణమంటూ ఆరోపిస్తున్నారు. మరొక్క విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాల్సిన గుజరాత్ టైటాన్స్ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడం వాళ్ల నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ విమర్శలు కురిపిస్తున్నారు.

ముంబై ఇండియన్స్ విధించిన 178 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో గుజరాత్ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (55), శుభ్‌మన్ గిల్ (52) హాఫ్ సెంచరీలు చేసి 106 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని అందించారు. అయితే మురుగన్ అశ్విన్ వేసిన 13వ ఓవర్‌లో శుభమన్ గిల్, వృద్ధిమాన్ సాహా ఇద్దరూ అవుట్ కావడంతో కథ అడ్డం తిరిగింది. పాండ్యా, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మిల్లర్ దారుణంగా విఫలం కావడంతో గుజరాత్ చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది.

దీంతో టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. హార్డిక్ పాండ్యా, రాహుల్ తెవాటియా తమ గొయ్యి తామే తవ్వుకున్నట్లు రనౌట్లయ్యారని మండిపడ్డాడు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్లు ఫ్లాప్ అయితే బాగుండేదని.. ఓపెనర్లు అందించిన శుభారంభంతో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఆ జట్టు గెలవాల్సిందని.. కానీ మిడిలార్డర్ బ్యాటర్లు నిర్లక్ష్యంగా ఆడారని.. గెలవాల్సిన మ్యాచ్‌ను ముంబైకి అప్పజెప్పారని సెహ్వాగ్ ఆరోపించాడు. అటు ఇంగ్లండ్ మాజీ ఆటగాడు పీటర్సన్ కూడా గుజరాత్ ఆటగాళ్లపై విమర్శలు కురిపించాడు. రనౌట్ల సందర్భంగా గుజరాత్ బ్యాటర్లు డైవ్ చేయలేకపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. వాళ్ల బ్యాటింగ్ నిరాశ కలిగించిందని.. ఇది పూర్తిగా నిర్లక్ష్యపూరిత ప్రదర్శన అని మండిపడ్డాడు.

Ben Stokes: రీఎంట్రీ అదుర్స్.. 64 బంతుల్లోనే స్టోక్స్ సెంచరీ