Sarfaraz Khan: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ లీక్ ఆరోపణలు.. ఎట్టకేలకు స్పందించిన సర్ఫరాజ్ ఖాన్!

Sarfaraz Khan Bgt 2025

Sarfaraz Khan Bgt 2025

Sarfaraz Khan About India Dressing Room Leak Allegations: 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సమయంలో భారత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశాడంటూ వచ్చిన ఆరోపణలపై భారత బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తాజాగా స్పందించాడు. ఆ వార్తలు తనను తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేశాయని, తన కుటుంబం కూడా ఎంతో బాధపడిందని వెల్లడించాడు. అయితే ఈ సమయంలో భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తనకు ఫోన్ చేసి అండగా నిలిచారని సర్ఫరాజ్ గుర్తుచేసుకున్నాడు. మాజీ భారత క్రికెటర్ ఆకాశ్ చోప్రాతో జరిగిన సంభాషణలో సర్ఫరాజ్ ఈ విషయాలను వెల్లడించాడు.

‘మీడియాలో న్యూస్ వచ్చిన తర్వాత నేను ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నా. గౌతమ్ గంభీర్ సర్ రెండుసార్లు నాకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇలాంటి నిరాధారమైన విషయాలను పట్టించుకోవద్దు, అనవసర రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆటపై దృష్టి పెట్టు అని సూచించారు. ఈ ఆరోపణల వల్ల నాన్న చాలా బాధపడ్డారని, నా భార్య ఏడ్చిందని గంభీర్‌కు వివరించా. వారిని కూడా ఓదార్చారు. ఇలాంటి ప్రచారాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా సర్ఫరాజ్‌ను క్రికెట్ ఆడనివ్వాలని మా నాన్నకు సూచించారు. సర్ఫరాజ్ మంచి క్రికెటర్ అని, ఏదైనా సహాయం అవసరమైతే తనకు ఫోన్ చేయాలని నాన్నకు భరోసా ఇచ్చారు. ఈ వ్యవహారంలో నాకు మొదటగా ఫోన్ చేసి మాట్లాడింది గంభీర్ సారే’ అని సర్ఫరాజ్ చెప్పాడు.

ఈ ఆరోపణలు తనను తీవ్రంగా బాధించాయని సర్ఫరాజ్ తెలిపాడు. ‘బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ముగిసి 20 నుంచి 25 రోజులు గడిచిన తర్వాత నేను ఇండియాకు వచ్చా. అప్పటికే గాయంతో బాధపడుతూ నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాస చికిత్స తీసుకుంటున్నా. విమానం దిగగానే నాకు ఫోన్లు, మెసేజెస్ రావడం మొదలైంది. సోషల్ మీడియాలో నా గురించి రకరకాల కథనాలు ప్రచారమయ్యాయి. అసలు ఈ విషయంపై ఎవరితో మాట్లాడాలో కూడా అర్థం కాలేదు’ అని సర్ఫరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ సమాచారాన్ని లీక్ చేశానన్న ఆరోపణలను సర్ఫరాజ్ పూర్తిగా ఖండించాడు. అలాంటిదేమీ జరగలేదని, నిజంగానే తాను ఆ పని చేసి ఉంటే ఇండియా-ఏ జట్టుకు, ఆ తర్వాత శ్రీలంక సిరీస్‌కు ఎంపికయ్యేవాడిని కాదని అన్నాడు. ఈ ఆరోపణలు ఎవరు చేశారో కూడా తనకు తెలియదని పేర్కొన్నాడు.