Site icon NTV Telugu

Sanju Samson: ముంచుకొస్తున్న ముప్పు.. సంజు శాంసన్‌కు ఇదే చివరి ఛాన్స్‌!

Sanju Samson

Sanju Samson

భారత్, న్యూజిలాండ్‌ టీ20 సిరీస్‌లో సంజు శాంసన్‌ భవితవ్యంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. మూడో టీ20 మ్యాచ్ సంజూ కెరీర్‌కు కీలక మలుపుగా మారుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా మరోసారి విఫలమైతే.. జట్టులో అతని స్థానం ప్రమాదంలో పడే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ మరో హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకుంటే.. టీమ్ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేకపోలేదు.

మూడో టీ20లో సంజూ శాంసన్‌ విఫలమైతే.. నాలుగో టీ20 నుంచి ఓపెనింగ్ బాధ్యతలను ఇషాన్‌ కిషన్‌కు అప్పగించే ఆలోచనలో బీసీసీఐ సెలెక్టర్లు ఉన్నారని సమాచారం. అభిషేక్ శర్మతో కలిసి ఇషాన్ కొత్త ఓపెనర్ కాంబినేషన్‌గా ఆడే అవకాశం ఉంది. ఇప్పటికే దూకుడైన బ్యాటింగ్‌తో అభిషేక్ మంచి ఇంపాక్ట్ చూపిస్తుండగా.. ఇషాన్ కూడా నిలకడగా పరుగులు చేస్తే ఈ జోడీ టీమ్‌కు కొత్త బలంగా మారనుంది. ఇక సంజూ స్థానంలో మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మను తీసుకునే అవకాశాలపై కూడా చర్చ జరుగుతోంది. నాలుగో టీ20లో నంబర్-3 స్థానంలో తిలక్ వర్మకు అవకాశం ఇవ్వాలనే ఆలోచన మేనేజ్‌మెంట్‌లో ఉందని తెలుస్తోంది.

Also Read: Kalki 2 Update: ‘కల్కి 2’ సౌండ్ అద్భుతం.. హింట్ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్!

తిలక్ వర్మ ఇటీవల తన బ్యాటింగ్‌తో బీసీసీఐ సెలెక్టర్లను ఆకట్టుకున్నాడు. కీలక సమయంలో పరుగులు చేసే సామర్థ్యం ఉండటంతో అతనిపై సెలెక్టర్లకు నమ్మకం ఉంది. మొత్తానికి మూడో టీ20 మ్యాచ్ సంజూ శాంసన్‌కు ‘డూ ఆర్ డై’ లాంటి పరిస్థితిగా మారింది. ఈ మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడి తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడా? లేదా కొత్త ఓపెనింగ్ కాంబినేషన్‌తో భారత్ ముందుకెళ్తుందా? అన్నది చూడాలి. అభిమానుల దృష్టి మొత్తం ఇప్పుడు ఈ కీలక మ్యాచ్‌పైనే ఉంది. ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ 2026 ఆరంభం కానున్న నేపథ్యంలో సంజూ కెరీర్‌కు ఇషాన్ రూపంలో ముప్పు పొంచి ఉంది.

Exit mobile version