Sanju Samson Creates History in T20 World Cups: టీ20 ప్రపంచ కప్ 2026లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లలో సంజు శాంసన్ ఒకడు. మెగా టోర్నీలో సంజు తన దూకుడైన బ్యాటింగ్‌తో అభిమానులను అలరించాడు. ముఖ్యంగా భారీ సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ.. 321 రన్స్ చేశాడు. ఇందులో ఏకంగా 24 సిక్సర్లు ఉండడం విశేషం. దీంతో ఒకే టీ20 ప్రపంచ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. టీ20 ప్రపంచ కప్ హిస్టరీలో ఇప్పటివరకు 20కి పైగా సిక్సర్లు కొట్టిన బ్యాటరే లేడు. హేమాహేమీలకు కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు.
టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఒక్కో ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాను ఓసారి చూద్దాం. 2007లో క్రెయిగ్ మెక్‌మిలన్ 13 సిక్సర్లతో టాప్‌లో నిలిచాడు. 2009లో టీమిండియా మాజీ బ్యాటర్ యువరాజ్ సింగ్ 9 సిక్సర్లు బాదాడు. 2010లో ఆసీస్ ఆటగాడు కామెరాన్ వైట్ 12 సిక్సర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 2012లో యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 16 సిక్సర్లు కొట్టి సిక్సర్ల వర్షం కురిపించాడు. 2014లో స్టీఫన్ మైబర్గ్ 13 సిక్సర్లు బాదగా.. 2016లో తమీమ్ ఇక్బాల్ 14 సిక్సర్లు కొట్టాడు. 2021లో జోస్ బట్లర్ 13 సిక్సర్లు బాదగా.. 2022లో సికందర్ రాజా 11 సిక్సర్లతో ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
2024 ఎడిషన్‌లో నికోలస్ పూరన్ 17 సిక్సర్లు బాదాడు. టీ20 ప్రపంచ కప్ 2026 ముందు వరకు పూరన్ టాప్‌లో నిలిచాడు. 2026లో సంజు శాంసన్ ఆ రికార్డును చెరిపేస్తూ ఏకంగా 24 సిక్సర్లు కొట్టి నయా చరిత్ర సృష్టించాడు. సంజు భారీ షాట్లు టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాయి. సంజు దూకుడైన బ్యాటింగ్, భారీ సిక్సర్లతో టీ20 ప్రపంచ కప్ 2026లో అభిమానులకు మరపురాని వినోదాన్ని అందించాడు. ఎన్నో ఒడిదుడుకులు, విమర్శలు ఎదురుకొన్న సంజు.. ఇప్పుడు టీమిండియా హీరో అయ్యాడు. టీ20 ప్రపంచ కప్ 2026 ద్వారా భారత కీలక ఆటగాళ్ల జాబితాలో ఒకడిగా చేరిపోయాడు. భారత్ తరఫున ప్రపంచ కప్‌లలో అద్భుత ప్రదర్శన చేసిన కపిల్ దేవ్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాల సరసన సంజు చేరాడు.
