Site icon NTV Telugu

Sanjay Manjrekar: భువనేశ్వర్ ఫామ్ తగ్గడానికి కారణమిదే!

Sanjay On Bhuvaneshwar

Sanjay On Bhuvaneshwar

Sanjay Manjrekar Interesting Comments On Bhuvaneshwar Kumar Form: టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎంత గొప్ప బౌలరో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన స్వింగ్ మేజిక్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించే భువి.. ఎన్నోసార్లు మ్యాచ్‌లను మలుపు తిప్పాడు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాంటి భువి ఇప్పుడు ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు. వికెట్లు తీయడం దేవుడెరుగు.. కనీసం కంట్రోల్ కూడా చేయలేకపోతున్నాడు. భారీ పరుగులు సమర్పించుకుంటున్నాడు. ఆసియా కప్‌లో భువి ఎంత పేలవ ప్రదర్శన కనబరిచాడో అందరికీ తెలిసిందే! ఆఖరి ఓవర్లలో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నాడు. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా సిరీస్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. దీంతో.. భువి ఫామ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ.. భువనేశ్వర్ ఫామ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది అతడు ఎక్కువగా ఆడుతున్నాడని, అలసట కారణంగానే ఫామ్ తగ్గిందని తన అభిప్రాయం వ్యక్తపరిచాడు. ‘‘భువి ఫామ్ తగ్గడానికి కారణం.. ఈ ఏడాది అతడు ఎక్కువ మ్యాచ్‌లు ఆడటమే. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లోని ఒక్క మ్యాచ్ మినహా.. అతడు అన్ని మ్యాచ్‌లు ఆడాడు. భువిని నేను చాలా సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నా. అతడు పని భారాన్ని ఎక్కువగా తీసుకోడు. ఒకట్రెండు ఫార్మాట్లే ఆడుతాడు. విరామం తీసుకొని, ఏదైనా టోర్నీలోకి కంబ్యాక్ ఇస్తే.. అప్పుడు తొలి మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తాడు. కానీ, ఈ ఏడాదిలో విరామం లేకుండా మ్యాచ్‌లు ఆడటం వల్ల.. అతని ఫామ్ తగ్గింది’’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో సీమర్‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని.. హర్షల్ పటేల్‌కి కొన్ని పరిమితులున్నాయి కాబట్టి, మహమ్మద్ షమీ పర్ఫెక్ట్ ఆప్షన్ అని తెలిపాడు.

Exit mobile version